
*.మర్యాదపూర్వకంగా కలిసిన సన్మానించిన అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్*
పయనించే సూర్యుడు, అక్టోబర్ 16,అశ్వాపురం: భారజల కర్మాగారం నూతన జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన ధర్మేష్ చంద్ర ఓజాను అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు సదర్ లాల్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు సదర్ లాల్ మాట్లాడుతూ, సాధారణ ఇంజనీర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, సీపీపీ క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా చేరి, వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రస్తుతం జనరల్ మేనేజర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.భారజల కర్మాగారం భారతదేశ పారిశ్రామిక, అణుశక్తి రంగాల్లో కీలకమైన సంస్థగా గుర్తింపు పొందిందని, దేశ భద్రతకు అవసరమైన కీలక ఉత్పత్తుల తయారీలో ఈ సంస్థకు విశిష్ట స్థానం ఉందని తెలిపారు. ధర్మేష్ చంద్ర ఓజా నాయకత్వంలో కర్మాగారం మరింత అభివృద్ధి సాధించాలని, దేశ రక్షణ, భద్రతకు ఉపయోగపడే ఉత్పత్తుల రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.అలాగే, గతంలో ధర్మేష్ చంద్ర ఓజాతో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని సర్పంచ్ సదర్ లాల్ తెలిపారు. టీఎన్టీయూసీ యూనియన్ తరఫున పలుమార్లు విజయాలు సాధించి, రెండువేల పదిహేను లో పదవీ విరమణ పొందిన తనకు, ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధం ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.ధర్మేష్ చంద్ర ఓజా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ, తన సేవలతో సంస్థకు, దేశానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని సర్పంచ్ బానోతు సదర్ లాల్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.