
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని శుక్రవారం అంబం (ఆర్) గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్ లు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అంబం (ఆర్) గ్రామంలో సుమారు 3,000 మంది జనాభా నివసిస్తున్నారని, సంవత్సరాలుగా గ్రామంలో సరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మురుగునీరు నిలిచిపోవడం వల్ల దోమలు వ్యాపించి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. అలాగే రుద్రూర్ మండల కేంద్రానికి వెళ్లే 4.5 కిలోమీటర్ల రహదారి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని వివరించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను తొలగించడానికి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టేందుకు, రోడ్డు మరమ్మతులకు తగిన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. వినతిపత్రాన్ని అందజేసిన వారులో వార్డు సభ్యులు బడే రాము, కమ్మరి లక్ష్మణ్ బి.ఏ. పోశెట్టి తదితరులు ఉన్నారు.