
భక్తిశ్రద్ధలు, నియమ నిష్ఠలతో అయ్యప్ప స్వామి సేవలో 24 ఏళ్ల ఆధ్యాత్మిక ప్రయాణం
పయనించే సూర్యుడు న్యూస్ – నవంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అయ్యప్ప స్వామిపై అచంచలమైన భక్తి, విశ్వాసంతో సీనియర్ జర్నలిస్ట్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి గురుస్వామి 24వసారి ఇరుముడి ధరించి పవిత్ర శబరిమల యాత్రకు బయలుదేరారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు యోగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రాలు, అయ్యప్ప నామస్మరణ మధ్య ఇరుముడి కట్టే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అయ్యప్ప స్వామి దీక్ష అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, ఆత్మనిగ్రహం, క్రమశిక్షణ, సమానత్వం, సేవాభావం, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని భక్తులు విశ్వసిస్తారు. 41 రోజులపాటు కఠిన నియమ నిష్ఠలు పాటిస్తూ, నిత్యం స్వామివారి నామస్మరణతో దీక్షను కొనసాగించడం అయ్యప్ప భక్తుల సంప్రదాయం. దీక్ష సమయంలో సాత్విక ఆహారం, బ్రహ్మచర్యం, కోపతాపాలకు దూరంగా ఉండటం, ప్రతి ఒక్కరినీ స్వామిగా భావించి గౌరవించడం వంటి నియమాలను పాటిస్తారు.ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు యోగేశ్వర శర్మ మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి అత్యంత పవిత్రమైన స్థానం ఉందని తెలిపారు. ఇరుముడిలోని ముందుముడి స్వామివారికి సమర్పించే పూజా సామగ్రితో ఉంటుందని, వెనుకముడిలో భక్తుడికి అవసరమైన వస్తువులు ఉంటాయని వివరించారు. గురుస్వాముల సూచనలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో ఇరుముడిని తలపై ధరించి శబరిమల యాత్రను కొనసాగించాలని సూచించారు. అయ్యప్ప నామస్మరణతో నియమ నిష్ఠలు పాటిస్తూ యాత్ర సాగించినప్పుడే దీక్షకు సంపూర్ణత చేకూరుతుందని పేర్కొన్నారు.24వసారి శబరిమల యాత్రకు బయలుదేరుతున్న శ్రీనివాస్ రెడ్డి గురుస్వామికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని అర్చకులు ఆకాంక్షించారు.
అనంతరం శ్రీనివాస్ రెడ్డి గురుస్వామితో పాటు సీనియర్ పాత్రికేయులు బాలరాజ్ నాగరాజు, రవీందర్ రెడ్డి, మునీశ్వర్ తదితర అయ్యప్ప స్వాములు ఇరుముడులు ధరించి శబరిమల యాత్రకు బయలుదేరారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగగా, భక్తులు స్వాములకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగనంపారు.