
సిద్దాపూర్లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని పిలుపు ( పయనించే సూర్యుడు నవంబర్ 23 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఆదివారం గ్రామంలోని పోలియో కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిన్నారుల నిండు జీవితానికి కేవలం రెండు పోలియో చుక్కలు ఎంతో అవసరమని, ఇవి వారి భవిష్యత్తుకు ఆరోగ్య భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎటువంటి అపోహలు, నిర్లక్ష్యం వహించకుండా ఐదు సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామం మొత్తం తిరిగి ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చుక్కలు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.