
గెలుపే లక్ష్యంగా అందరూ ఏకతాటిపైకి రండి: గుత్తుల సాయి పయనించే సూర్యుడు నవంబర్ 22 ముమ్మడివరం ప్రతినిధి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమష్టిగా, అంకితభావంతో పనిచేస్తున్నాయని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు తక్షణమే తమ నామినేషన్లను ఉపసంహరించుకుని, కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని గుత్తుల సాయి విజ్ఞప్తి చేశారు. పార్టీ నిర్ణయానికి, కూటమి ఐక్యతకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేసిన విధంగా ఎంతటి వారైనా ఉపేక్షించకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కావున రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు తక్షణమే పోటీ నుంచి వైదొలిగి, కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని, పార్టీ ఐక్యతను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయపరంపరను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుత్తుల సాయి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించేందుకు అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.