
డిల్లీ నుండి గల్లి వరకు కూటమిదే హవా.
పయ నించే సూర్యుడు అక్టోబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, స్థానిక సంస్థల్లోనూ బీజేపీ–ఎన్డీఏ కూటమి ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ పాలన ఏర్పడి అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పారిశ్రామిక ప్రగతి, డిజిటల్ సేవలు, రహదారుల నిర్మాణం వంటి రంగాల్లో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులు వంటి కీలక అంశాలపై సమన్వయంతో ముందుకు సాగడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై చూపుతున్న చొరవ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం బలోపేతం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాయని తెలిపారు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం, కార్యకర్తల కృషి, ప్రజల విశ్వాసం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కీలకమవుతాయని పేర్కొన్నారు.
స్థానిక సంస్థలు ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించే కీలక వ్యవస్థలని, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో వాటి పాత్ర అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటే అభివృద్ధి పనుల అమలు వేగవంతమవుతుందని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు మరింత సమర్థంగా చేరుతాయని వివరించారు.రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి లక్ష్యమని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ ఇంజిన్ పాలన ద్వారా సమగ్ర అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి రామచంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.