Sunday, September 21, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసి చట్టాలు- గిరిజన యేతరులకు చుట్టాలు.ఏజెన్సీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం. ఆదివాసి ప్రజాప్రతినిధుల...

ఆదివాసి చట్టాలు- గిరిజన యేతరులకు చుట్టాలు.ఏజెన్సీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం. ఆదివాసి ప్రజాప్రతినిధుల చేతగానితనం!

Listen to this article

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు ఇంచార్జి సెప్టెంబర్ 20

భారతదేశము ఒక విలక్షణమైనది. భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులను సామాజిక ఆర్థిక సంస్కృతిక పరిస్థితుల ఆధారంగా పరిపాలన సౌలభ్యం కోసం పలువర్గాలుగా విభజింప పడ్డాయి. అందులో భాగంగానే భారత దేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన స్థాయిలో హక్కుల అందాలని ఆ హక్కులు సక్రమంగా అమలు జరగటం కోసం రాజ్యాంగంలోని ప్రత్యేక చట్టాలను రాయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఐదు మరియు ఆరవ షెడ్యూలు పూర్తిగా ఆదివాసుల పరిపాలన గురించి వివరించబడ్డాయి అయితే ఆరవ షెడ్యూల్ భూభాగం పూర్తిస్థాయి ఏజెన్సీ షెడ్యూల్ భాగం కావడంతో అక్కడ అటానమస్ కౌన్సిల్స్ అమల్లో ఉన్నాయి. ఐదవ షెడ్యూల్ భూభాగంలో రాష్ట్రాలలో కొంతమేరకు మాత్రమే ఏజెన్సీ భూభాగాలు ఉండటం వలన స్వయం పరిపాలన ఇక్కడ అమలుకు నోచుకోవటం లేదు. సాధారణ ప్రభుత్వ ఆధీనంలోని ఐదవ షెడ్యూల్ భూభాగంలోని ఏజెన్సీ ప్రాంతాలు పరిపాలించబడుతున్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కేవలం 17 పంచాయితీలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 4 మండలాలు ఏజెన్సీగా మరో నాలుగు మండలాలు పాక్షిక ఏజెన్సీ భూభాగం కలిగి ఉన్నాయి. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 11 11 మండలాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 మండలాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 4 మండలాలు పూర్తి ఏజెన్సీగా ఉండగా ఒక పోలవరం మండలం మాత్రం కొంత భాగం మాత్రమే ఏజెన్సీ ఏజెన్సీ గా చూపించబడుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడిశ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వందలాది ఆదివాసి గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలైనప్పటికీ ఆయా గ్రామాలు రాజ్యాంగం ద్వారా ఏజెన్సీ గ్రామాలకు కల్పించిన హక్కులను కోల్పోతున్నాయి. రాజకీయ కుట్రల తోటి షెడ్యూల్ ప్రాంత గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించకుండా అధికారులు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న అన్ని ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసి చట్టాలు పూర్తిగా అమలులో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది 1/70 చట్టం, పిసా చట్టం. అయితే ఈ చట్టాలు పేపర్లలో మాత్రమే అమలులో ఉన్నాయి క్షేత్రస్థాయిలో అమలకు నోచుకోవటం లేదు ఇందుకు ఉదాహరణలుగా ఉన్నాయి. అవే 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనయేతరులు గిరిజనయేతరుల మధ్య భూ బదలాయింపులు, ఆదివాసులు గిరిజనయేతరులు మధ్య భూపదలాయింపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇందులో దౌర్జన్యాలు, ఆక్రమాలు, అక్రమ కట్టడాలు, అక్రమ వ్యాపారాలు కూడా ఉన్నాయి. 👉అసలు 1/70 చట్టం అంటే ఏమిటి? ఈ చట్టం చరిత్రలోకి వెళ్తే బ్రిటిష్ పాలనలోని ఆదివాసి ప్రాంతానికి ప్రత్యేక ఏజెన్సీ భూభాగంగా నామకరణం జరిగింది. 1834 షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్, 1917 ఏజెన్సీ ట్రాక్స్ చట్టం ఆదివాసి ప్రాంతాలను రక్షించడానికి ఆనాటి బ్రిటిష్ పాలకులు తీసుకువచ్చిన చట్టాలివి. ఆదివాసులు యొక్క ప్రత్యేక సంస్కృతి( ఆచార సంప్రదాయాలు, భాషలు, కట్టుబాట్లు, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, పండుగలు మొదలైనవి ) ఇతర జాతులతో పోలిస్తే ఆదివాసులు భిన్నంగా కలిగి ఉన్నారు. అంతేకాక ఆదివాసీలు అమాయకులు చాలా సులభంగా ఇతరుల చేత బయట నాగరికత సమాజం నుంచి వచ్చిన వాళ్ళ చేత మోసపోబడతారని ఇది ఆదివాసి నాగరికతని పూర్తిగా దెబ్బతీస్తుందని అర్థం చేసుకున్న బ్రిటిష్ పాలకు ఆదివాసులకు రక్షణ కవచంగా ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. స్వాతంత్ర అనంతరం ఇదే చట్టాలను ఆధారంగా భారత రాజ్యాంగంలో ఆదివాసి భూభాగంలో రక్షణ కోసం ప్రత్యేకంగా ఆదివాసులకు ఐదు ఆరు షెడ్యూల్ రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 5వ షెడ్యూల్ లోనికి వస్తుంది. ఏజెన్సీలోని భూ నాన్ ట్రైబల్స్ బదలాయింపులు , భూ అక్రమనలు, వడ్డీ వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు, నాన్ ట్రైబల్ వలసలు, నాన్ ట్రైబల్ వ్యాపారాలు అరికట్టేందుకు 1/59 చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. అనంతరం ఈ చట్టం యొక్క పూర్తి అమెండ్మెంట్ 1970 లో 1/70 చట్టంగా రూపు దాల్చడం జరిగింది. 👉 1/70 చట్టం ఏం చెబుతుంది. 1/70 చట్టం పూర్తిగా ఆదివాసులు రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు. ఈ చట్టం అమలకు ఎన్నో పోరాటాలు జరిగాయి. దీని వెనక ఎన్నో ప్రాణ త్యాగాలు కూడా ఉన్నాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంత భూ బదలాయింపు నిషేధిత చట్టం అని కూడా పేర్కొంటారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాలలో నాన్ ట్రైబల్- నాన్ ట్రైబల్ మధ్య ఎటువంటి భూ బద్దలయింపులు జరగకూడదు. అలాగే ట్రైబల్ – నాన్ ట్రైబల్ మధ్య కూడా భూ బదులా ఇప్పుడు నిషేధం. కేవలం ఆదివాసీలకు – ఆదివాసీలకు మధ్య మాత్రమే భూ బదలాయింపుకు అవకాశం కలదు. ఈ భూపాలయింపులు జరగాలన్న ఏజెంట్ టూ ది గవర్నమెంట్ అనగా జిల్లా కలెక్టర్ అనుమతులతో జరగాలి. అంతేకాక 1/70 చట్టం మైదాన ప్రాంతల నుండి ఆదివాసి యేతరులు ఏజెన్సీ ప్రాంతానికి వలసలు నిషేధం, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల భూములు ఉదాహరణకు బంజర గాయాలు, కాలువలు, చెరువులు, నది పరివాహ ప్రాంత నీటి స్థలాలు, ఆర్ అండ్ బి స్థలాలు మరియు ప్రజా అవసరాలకు సంబంధించిన అన్ని రకాల భూములు ఆక్రమించుకోవడం కూడా నిషేధం. ఇటువంటి భూములు అన్ని కూడా ఉంటే ఆదివాసీల ఆధీనంలో ఉండాలి లేదంటే ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడాలి అంతేతప్ప నాన్ ట్రైబల్స్ ఆధీనంలో గాని ఆ క్రమంలో గాని ఉండకూడదు. ఈ చట్టం ప్రకారం ఏజెన్సీలో వడ్డీ వ్యాపారాలు పూర్తిగా నిషేధం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిషేధం.👉 మరి చట్టం అమలు అవుతుందా!?.1/70 చట్టం రాజ్యాంగం పరంగా ప్రభుత్వ ఉత్తర్వులు పరంగా పేపర్లో మాత్రమే అమల్లోకి ఉంది కానీ క్షేత్రస్థాయిలో ఈ చట్టం పూర్తిగా అమలుకు నోచుకోవటం లేదు. వీటిపై ఆదివాసి సంక్షేమ పరిషత్ షెడ్యూల్ ప్రాంతాలలో మండల రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా గిరిజనయేతురుల అక్రమలకు సంబంధించి వివరాలు కోరగా, సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో ఇవ్వకపోయినా వారు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే షెడ్యూల్ ప్రాంతాలుగా పిలవబడే అన్ని మండల కేంద్రాలు అన్నీ కూడా నాన్ ట్రైబల్ కబ్జాల్లో ఉన్నట్లు తేటతెల్లమైంది. మరి వీటన్నిటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారా అంటే ఆ దిశగా అధికారులు చర్యలు శూన్యం! బయట ప్రాంతాల నుండి వలసలు వచ్చిన నాన్ ట్రైబల్స్ రాజకీయ పార్టీల, అధికారంలో ఉండే ప్రజాప్రతినిధుల, మరియు వారి యొక్క ఆర్థిక అంగబలంతోటి రెవెన్యూ పంచాయతీ అధికారులను డబ్బులతో మేనేజ్ చేస్తూ ఆదివాసి రక్షణ భూభాగమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాలను చీల్చుకుంటూ, 1/70 చట్టాన్నికి తూట్లు పొడుస్తూ అన్ని ఏజెన్సీ మండల కేంద్రాలను నాన్ ట్రైబల్స్ వ్యాపార సముదాయాలుగా మార్చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వాల నిర్లక్ష్యం అధికారుల చేతివాటం పూర్తిగా కనిపిస్తుంది.👉 1/70 చట్టం అమలకై ఆదివాసుల ఉద్యమాలు!.ఈ చట్టం 1970లో పూర్తిస్థాయి అమల్లోకి వచ్చినప్పటికీ దీని మూలాలు ఇదివరకే మనం చెప్పుకున్నాం. అయితే బ్రిటిష్ పాలనలో కూడా ప్రత్యేక చట్టాలు రావడానికి ఆదివాసి ఉద్యమాలే కారణం. భారతదేశము పై దండెత్తిన ప్రతి విదేశీయులను ప్రతికటించిన మొట్టమొదటి వారు కూడా ఆదివాసీలే!. దురదృష్టవషత్తు ఈ దేశ చరిత్రలో పాఠ్యపుస్తకాలలో ఈ దేశాన్ని ఆక్రమించిన డచ్, పోర్చుగీస్, మొగలలు,ఆర్యులు మొదలగు వారి చరిత్రలు రాయబడ్డాయి గాని భారత దేశ ఆత్మ అభిమానం కోసం, దోపిడి వ్యవస్థను నిరోధించడం కోసం, ఈ దేశానికి స్వతంత్రం కోసం మొట్టమొదటి ప్రతిఘటించిన వారు ఆదివాసీలు వారి చరిత్ర మాత్రం కుటిల రాజకీయాల వలన నాన్ ట్రైబల్ పాలకుల వలన కాలగర్భంలో కలిసిపోయాయి. భారతదేశంలోని వలస వచ్చి ఇక్కడ సంపదను దోచుకోవడానికి ప్రయత్నించిన ప్రతి విదేశీయుడు ఆదివాసి యొక్క నాడిని తెలుసుకున్నాడు ఎంతోమంది విదేశీయులు ఆదివాసీలు ఎందుకు పోరాటం చేస్తున్నారో తెలుసుకున్నప్పటికీ వారికి కావలసిన న్యాయం ఏమి చేయలేకపోయారు. కానీ బ్రిటిష్ పాలకులు మాత్రం అలా వదిలేయలేదు ఆదివాసుల పోరాటాలపై మానవ తత్వ శాస్త్రవేత్తలతోటి ఎన్నో దశాబ్దాల పాటు పరిశోధన చేయించారు. చివరికి ఆ పరిశోధన ద్వారా ఆదివాసీల పోరాటాలుకు కారణాలు తెలుసుకున్నారు. ఆదివాసీల పోరాటం కేవలం వారి నివసిస్తున్న భూమి, ఆడివి,నీరు అందులోని ఖనిజ సంపద దోపిడికి గురికాకుండా తమ సంస్కృతిని విచ్చిన్నం కాకుండా వాళ్ళ ఐక్యత కి భంగం వాటిల్లకుండా వారు ఆత్మగౌరవంతో బతకాలని ఆశిస్తున్నట్లు గుర్తించిన బ్రిటిష్ పాలకులు ప్రత్యేకంగా ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలను నిషేధిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగినది. అనగా ఆదివాసీల ప్రాంతాల్లోకి ఇతరులు ఎవరు ప్రవేశించరాదు వారి యొక్క సంస్కృతిని నాశనం చేయకూడదు వారి హక్కులను దోచుకోకూడదు వారు ఆత్మ అభిమానంతో బతకాలి. ఈ దేశానికి నిజమైనటువంటి వారసులు ఆదివాసులే కాబట్టి వాళ్ళ హక్కుల పరిరక్షణకై ప్రత్యేక చట్టాలు ఉండాలనే ఉద్దేశంతోటే ఆదివాసుల కొరకు ప్రత్యేక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలే స్వతంత్ర అనంతరం 1/70 చట్టంగా ఐదవ షెడ్యూల్ భాగంలో చూస్తున్నాం. స్వతంత్ర అనంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాల దృశ్య చట్టాలను పేపర్లో అమలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అవి అమలకు నోచుకోవటం లేదు . దీనిలో భాగమే 1969 -70 శ్రీకాకుళ నక్షల బారి రైతాంగ ఉద్యమాన్ని వంటివి మొదలయ్యాయి. అటువంటి ఉద్యమాలు కాలక్రమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కొనసాగాయి. క్రమంగా ఆదివాసీల్లో విద్యాభ్యాసం పెరగటం రాజ్యాంగ చట్టాలు అవగాహన చేసుకోవడం వాటి అమలు కోసం ఎన్నో ఆదివాసి సంఘాలు ఉనికి లోకి రావడం మొదలుపెట్టాయి. పోరాటాలు అయితే సాగుతున్నాయి తప్ప ప్రభుత్వాలు ఆ పోరాటాలు వెనకున్న కారణాలను గుర్తించకుండా ఆ పోరాటాల అణిచివేతకు చర్యలు తీసుకుంటున్నాయి. దీని మూలంగానే ఆదివాసీల్లో అనిచితి నిర్లిప్తత, ఆవేదన, ఆందోళనలు నెలకొన్నాయి. రాజ్యాంగం ద్వారా ఆదివాసీలకు సంక్రమించినటువంటి హక్కులు అందించకపోగా ఆ హక్కులకు సంబంధించినటువంటి చట్టాలు అమలుకు నోచుకోకపోవడం స్వతంత్ర భారతదేశంలో సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఏజెన్సీలోని ప్రత్యేక చట్టాలే కాకుండా బ్రిటిష్ కాలంలో 1905 భూ ఆక్రమణ నిషేధిత చట్టం వంటివి కూడా అమలులో ఉన్నాయి. వాటి ఆధారంగా 2011లో సుప్రీంకోర్టులో జాగ్పాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మరియు అనేక ఇతర కేసులు ద్వారా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జీవో ఎంఎస్ 188 (పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ) 2011 జులై 21 లో అమల్లోకి రావడం జరిగింది. ఈ జీవో ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ స్థలాలు లైన ఆర్ అండ్ బి, రైల్వే స్థలాలు, నీటి స్థలాలు, స్మశాన వాటికలు, ప్రత్యేక చట్టాలు కలిగిన ఏజెన్సీ ప్రాంతాలలో భూ ఆక్రమణ నిషేధం. కానీ ఈ చట్టాలు జీవోలు అమలు కూడా అంతంత మాత్రమే.ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా, WP (PIL) 47/2025 ఉత్తర్వులు ప్రకారం అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ను తొలగించాలని పేర్కొనది.👉 అధికారులు ఏం చేస్తున్నారు అంటే.!ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ Progs. No. 78/2025/B2(P. W) తేదీ 28/04/2025 ప్రకారం జిల్లాలోని అన్ని ప్రాంతాలలో భూ ఆక్రమణలు గుర్తించి తొలగించే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన మొదటిలో ఒకటి రెండు చోట్ల హడావుడి చేసి వదిలేసారు. అయితే భూ ఆక్రమణలు మాత్రం జిల్లా వ్యాప్తంగా గుర్తించినప్పటికీ సంబంధించిన రెవెన్యూ, పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులు వాటిని ఇప్పటిదాకా తొలగించలేదు. దీనికి కారణం ఏమిటంటే అక్రమాలు గుర్తించినటువంటి వారిలో 90% పైగా వలస నాన్ ట్రైబల్స్, వీరికి రాజకీయ బలం, ప్రజాప్రతినిధుల బలం, ధన బలం ఉండడంతోటి అధికారులను సులభంగా ముడుపుల తోటి, మరియు భయంతోటి నా ట్రైబల్స్ గుప్పెట్లో పెట్టుకుని ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ చేయకుండా చేస్తున్నారు. స్థానిక అధికారులు, పై అధికారుల యొక్క ఆదేశాలను, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రత్యేక చట్టాలను, అదేవిధంగా గౌరవ న్యాయస్థానాల ఉత్తర్వులను మరియు ఇతర జీవోలను చట్టాలను ఆధారంగా చేసుకుని ఆక్రమణలు గుర్తిస్తున్నారు . కానీ వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు తప్ప తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగడం లేదు. ఉన్నత స్థాయి అధికారులు కూడా రాజకీయ ఒత్తిడిలో తలవంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఉన్నతాధికారులే చేతులెత్తేయడంతో స్థానిక అధికారులకు అదొక వరంగా మారి నోటీసులు జారీ చేసిన వారి నుండి ముడుపులు వసూలు చేస్తూ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగించకుండా కాలయాపన చేస్తున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుత ఏలూరు జిల్లా ఏజెన్సీలో, పార్వతి పురం మన్యం జిల్లా, మరియు కర్నూల్ జిల్లా శ్రీశైలం ఏజెన్సీ ప్రాంతంలో హైకోర్టు ఉత్తర్వులు పాటింపుగాని, ఏజెన్సీ చట్టాలు అమలు గాని అమలు చేసే అధికారి లేడు.👉 ఆదివాసి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం!, చేతగానితనం.భారత రాజ్యాంగంలోని ఆదివాసులకు కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్ కోటాలో గెలుపొందిన సర్పంచి స్థాయి నుంచి, ఎంపీటీసీ జడ్పీటీసీలు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు, వాటి ద్వారా మంత్రులుగా ఎన్నికైన ఆదివాసి ప్రజాప్రతినిధులు కేవలం వాళ్ల సౌకర్యాలు సౌభాగ్యాలు చూసుకుంటున్నారే తప్ప తమ ఆదివాసి అస్థిత్వానికి మూల కారణమైన ఆదివాసి చట్టాలు, ఆదివాసి అభివృద్ధికి అవసరమైన ఆదివాసి హక్కులు, ఆదివాసి ఉనికికి మనుగడకు మూలాధారమైన ఆదివాసి సంస్కృతి పరిరక్షణ వీరికి పట్టదు. రాజకీయ పార్టీలలో చేరి రాజకీయ పార్టీలు ఆదివాసులను ఓటు బ్యాంకుగాఎలా వాడుకుంటున్నారో, ఆదివాసి ప్రజాప్రతినిధులు కూడా వారు గెలిచిన తర్వాత ఆదివాసుల్ని మర్చిపోతున్నారు. మళ్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పార్టీ గుర్తులతోటి సంక్షేమ పథకాలు కరపత్రాలు మోసుకొస్తారే తప్ప ఒక్క ప్రజా ప్రతినిధి కూడా నేను ఈ ఆదివాసి చట్టాన్ని అమలు చేయించాను, ఈ ఆదివాసి రిజర్వేషన్ పోకుండా చేశాను, ఈ జీవో అమలకు కృషి చేశానని చెప్పిన చరిత్ర దాఖలాలు లేవు, చేసిన ఆధారాలు లేవు. అసలు సట్ట సభలో వీటి ప్రస్తావని మాట్లాడారు. ఇది నేటి ఆదివాసి ప్రజా ప్రతినిధుల పరిస్థితి. ఆదివాసి రాజ్యాంగ చట్టాలతో గెలుపొంది ఆదివాసి చట్టాలను అమలు చేయించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్లు ఆడిచ్చినట్లు ఆడుతూ వాళ్ళు పాడినట్టు పాడుతూ వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా బతుకుతున్నారు. ఇది కాదు నిజమైన ఆదివాసి ఆత్మగౌరవం. ఒక కొమరం భీమ్, ఒక బీర్స సముండా, ఒక సమ్మక్క సారక్క, ఘం గంటం దొర, మల్లు దొర, కారం తమ్మన్న ధర, పూరి సింగరాజు ఇంక దేశానికి స్వతంత్రం కోసం ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఆత్మ అభిమాన పోరాటాలు చేసిన ఆదివాసి అమరవీరులు నిజమైన ఆదివాసీల ఆత్మ బంధువులు. ఆదివాసి రిజర్వేషన్లతోటి గెలిచి ఆదివాసి చట్టాలను ఖూనీ చేస్తూ ఆదివాసీల్ని మోసం చేసే నేటి బూర్జవ ప్రజాప్రతినిధులు ఆదివాసి ద్రోహులే.!👉 ఆదివాసి లారా మేల్కోండి!జల్ జంగల్ జమీన్ ఉద్యమాలు కేవలం బ్రతుకు కోసం మాత్రమే సాగలేదు ఆదివాసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని చాటుకోవటం కోసం సాగిన ఉద్యమాలు. అటువంటి ఉద్యమాలు కొనసాగించిన ఎందరో ఆదివాసి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని నేడు ఆదివాసి ప్రజానీకం ఆదివాసి చట్టాల అమలు హక్కుల సాధనకై ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, అధికారుల చేతగానితనానికి స్వప్తి పలకాలంటే పోరాటమే శరణ్యం. ఆదివాసి ప్రజాప్రతినిధుల కూడా ఆదివాసి ఉద్యమాల్లో పాలుపంచుకునేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఆదివాసి ప్రజానీకానికి ఉంది. కోల్పోయిన ఆదివాసి ఏజెన్సీ భూభాగాన్ని తీసుకురావాలన్న, ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ వలసల అరికట్టాలన్న, దురాక్రమలను నిషేధించాలన్న చట్టాలు అమలే దీనికి మార్గం అందుకు కృషిచేయని ప్రభుత్వాలపై ఆ దిశగా ప్రయత్నం చేయని ప్రజాప్రతినిధులపై ఆదివాసులు విప్లవ శంఖం మోగించాలి. ప్రతి ఆదివాసిగూడేలు చైతన్యమై ముందుకు సాగాలి. ఉన్నత చదువుల్లో రాణిస్తూ రాజ్యాంగ చట్టాల అమలు కోసం యువత ప్రజలు ఉద్యోగులు ఆదివాసి మేధావులు క్రియాశీల క్షేత్రస్థాయి ఉద్యమాలకు నాంది పలకాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ పిలుపునిస్తోంది. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న దృశ్య ఆదివాసి ప్రజాప్రతినిధులు ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక ఉద్యోగ నియామక చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పై చట్టసభలో ఒత్తిడి చేయాలని ఆదివాసి సంఘాలు ఆదివాసి ప్రజానీకం డిమాండ్ చేస్తున్నాయి.వ్యాసకర్త కుంజా శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్: 7995036822

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments