
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 20. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ రైతుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తాం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ పెండింగ్ లో ఉన్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్యలు అటవీ మంటల నియంత్రణకు రైతులు సహకరించాలి ఉపాధి హామీ క్రింద పి.టి, ఫార్మ్ పౌండ్ నిర్మాణానికి ప్రతిపాదన సింగరేణి మండలం తౌసీబుడు గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అటవీ అధికారి రైతుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు.
గురువారం జిల్లా అటవీ అధికారి సింగరేణి మండలం తౌసీబుడు గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ సంబంధిత సమస్యలు, అటవీ హక్కుల గుర్తింపు, రహదారి కనెక్టివిటీపై నిర్వహించిన బహిరంగ గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి వివాదాలు, ఆందోళనలు, వ్యవసాయ క్షేత్రాలకు, మార్కెట్ కు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ ఆవశ్యకత, ఆహారం, నీటి కోసం వ్యవసాయ భూముల వైపు వస్తున్న వన్య ప్రాణులకు సంబంధించిన సమస్యలు, కోతుల బెడదపై రైతులు సమస్యలను లేవనెత్తారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి సిదార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ అడవుల్లో మంటలు చెలరేగడం, అటవీ ప్రాంతంలో పండ్ల చెట్లు తగ్గిపోవడంతో కోతులు వ్యవసాయ భూమి వైపు వస్తున్నాయని, రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న సరిహద్దు వివాదాలను, రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు సంబంధిత శాఖల సమావేశంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.కందకం తవ్వి అటవీ, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. భూములకు స్పష్టంగా సరిహద్దు ఏర్పాటు చేస్తామని, వన్య ప్రాణులను అడవికి పరిమితం చేసేందుకు పండ్ల చెట్లను, గచ్చకాయను నాటడం జరుగుతుందని, ట్రెంచ్ ఎస్ఎంసి కొలతగా కూడా పని చేస్తుందని అన్నారు. ఉపాధి హామీ క్రింద పి.టి, ఫార్మ్ పౌండ్ నిర్మాణానికి ప్రతిపాదించాలని, అటవీ మంటలను ఆపడానికి సమాచార నెట్వర్క్ నిర్మిస్తున్నామని, దీనికి రైతులు సహకరించాలని జిల్లా అటవీ అధికారి కోరారు. టి.జి.ఎఫ్.డి.సి. నిధుల క్రింద మొబైల్ హాస్పిటల్ ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు.అడవిలో మైదాన ప్రాంతంలో మంకీ కోర్ట్ ప్లాంటేషన్ చేస్తామని, రైతులకు సౌర శక్తితో నడిచే బోర్ వెల్ లను అందించడానికి ఐటిడిఏ మద్దతు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం ద్వారా ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవడానికి, అటవీ అధికారులపై స్థానిక సమాజం నమ్మకం పెంచుకోవడానికి వీలు కల్పించిందని, రైతుల జీవనోపాధికి భరోసా నిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి రైతులు తమ సహకారం అందించాలని జిల్లా అటవీ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డివో మంజుల, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
