Wednesday, October 22, 2025
Homeఆంధ్రప్రదేశ్సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న 'బినామీ' విలేకరి

సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ‘బినామీ’ విలేకరి

Listen to this article

ఏజెన్సీ చట్టానికి తూట్లు, ప్రభుత్వ స్థలాల కబ్జా, బెల్ట్ దందా – అధికారులు మౌనం!

ఏన్కూర్ మండల కేంద్రంలో చట్టానికి సవాల్: పాత్రికేయ ముసుగులో చీకటి సామ్రాజ్యంపై చర్యలెప్పుడు?

పయనించే సూర్యుడు అక్టోబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న సూక్తికి ఏన్కూర్ మండల కేంద్రంలో విలువ లేకుండా పోతోంది. ఇక్కడ ఒక విలేకరి తన పాత్రికేయ గుర్తింపును అడ్డం పెట్టుకొని, చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, ఏజెన్సీ ప్రాంత భూ బదలాయింపు చట్టం (1/70 చట్టం) ఉల్లంఘన మరియు అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నప్పటికీ, ఈ వ్యక్తిపై ఏ అధికారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. బినామీ వ్యాపారాలు

సదరు వ్యక్తి కేవలం విలేకరి కార్డును చూపించి, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పేరుకు విలేకరి అయినప్పటికీ, ప్రజా సమస్యలపై ఏనాడూ కలం పట్టిన దాఖలాలు లేవని, అతని దృష్టి కేవలం అక్రమ వ్యాపారాల విస్తరణపైనే ఉందని తెలుస్తోంది.

1/70 చట్టం ఉల్లంఘన:

గిరిజనుల హక్కులను పరిరక్షించే ఏజెన్సీ చట్టాన్ని (1/70) బేఖాతరు చేస్తూ, ఏన్కూర్ ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ వెంచర్లను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గిరిజనేతరులు ఏజెన్సీ భూములను కొనుగోలు చేయడం, అమ్మడం చట్ట విరుద్ధం అయినప్పటికీ, రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపాడు.

ఎక్సైజ్ దందా:

స్థానిక బార్ షాపుల యజమానులకు ‘తొత్తుగా’ వ్యవహరిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపుల నిర్వహణకు సహకరిస్తున్నాడు. ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇచ్చి, అక్రమ మద్యం వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా నడిపిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఇతను బార్ షాపులకు సూపర్‌వైజర్‌గా కూడా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వ స్థలాల కబ్జా:

ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారిని ఆక్రమిస్తూ, అనుమతి లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడం స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ప్రైవేట్ చిట్టి పాటలు వంటి ఇతర చీకటి వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు.

అధికారుల మౌనం..

ప్రజా పాలకుల అండదండలు అక్రమ వెంచర్లు, బెల్ట్ షాపులు, ప్రభుత్వ భూముల కబ్జా వంటి విషయాలు అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ, ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి ఏ అధికారి సాహసించడం లేదు. “నా దగ్గర డబ్బు ఉంది, అంగ బలం ఉంది” అంటూ అధికారులను బెదిరించడం వల్లే వారు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాక, అధికార పార్టీలో ఉన్న కొందరు నాయకులు సైతం ఇతని మోచేతి నీళ్లకు అలవాటు పడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. విలేకరికి ఒక రూలు, సామాన్యుడికి ఒక రూలు ఉంటుందా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజల డిమాండ్:

వెంటనే అధికారులు స్పందించి, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేయాలని, అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా, అక్రమ నిర్మాణానికి కరెంట్ మీటర్ ఇచ్చిన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చట్టంపై ఉన్న అపోహను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.నిజమైన పాత్రికేయ విలువలను మంటగలుపుతూ, అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్న ఈ బినామీ విలేకరిపై ఉన్నతాధికారులు ఎప్పుడు దృష్టి సారించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments