
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి హర్షిస్తూ శనివారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. గతంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ లక్ష్మీ పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ 500 గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, రుణమాఫీ, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయసే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టంకటేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పట్టణ, మండల నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు, మహిళా కాంగ్రెస్ కమిటీ నాయకులు, కాంగ్రెస్ యూత్ విభాగం, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్స్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు