
ఆర్టిఐ చట్టాన్ని నీరుగారిస్తున్న అధికారులపై ఆర్టిఐ కమిషన్ ఫిర్యాదు చేస్తాం – కుంజ శ్రీను
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 26
అక్రమ కట్టడాలకు సంబంధించిన వివరాలు ధ్రువీకరించి ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే 30 రోజులు దాటిన రెవిన్యూ, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉద్దేశ పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. ఒకపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టు సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఏజెన్సీ లో పనిచేసే రెవెన్యూ అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు. చింతూరు మండలంలో గుర్తించిన అక్రమ కట్టడాల కు సంబంధించిన సమాచారం ఇవ్వాలని గత నెల 25వ తారీఖున చింతూరు ఎమ్మార్వో కార్యాలయంలో సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గం లో పలు మండలాల్లో ఆర్టిఐ చట్టం కింద అక్రమ కట్టడాల జాబితా ఇవ్వాలని దరఖాస్తు చేసిన సమాచారం ఇవ్వలేదని, కొన్ని మండలాల వాళ్లు సమాచారం పంపితే వాటిలో సంతకాలు లేవని, కొంతమంది ఎమ్మార్వోలు ఎండార్స్మెంట్లు మాత్రమే పంపి సమాచారం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, కొంతమంది ఎమ్మార్వోలు సంతకాలు లేకుండా సమాచారం ఇచ్చి దానికి ఎండార్స్మెంట్ లేకుండా ఇచ్చారని, కొన్ని మండల కార్యాలయాల్లో మేము పెట్టిన దరఖాస్తు లేవని తిరిగి మమ్మల్ని ఎప్పుడు పెట్టారు అని అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి అధికారులపై కమిషన్ మరియు ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ దారులకు నోటీసులు ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే అక్రమ కట్టడాలు కూల్చకుండా రెవిన్యూ, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని దీనికి కారణం అధికారులకు ముడుపులు అందటమేనని ఆయన ఆరోపించారు. నోటీసులు ఇచ్చి మూడు నెలలు గడుస్తున్న చాలా చోట్ల అక్రమ కట్టడాలు కూల్చకపోవటం కారణం అక్రమ దారులకు అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందమేనని ఆయన విమర్శించారు. దీని మూలంగానే అక్రమ కట్టడాల జాబితా కోసం దరఖాస్తు చేసిన నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ అక్రమ కట్టడాల తొలగింపు ఆగలేదు అని పేపర్ ప్రకటన ఇచ్చి ఉన్నారు కానీ ఈ మూడు నెలలుగా ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియ జరగలేదు. చింతూరు లో కూడా నోటీసులు ఇచ్చి మూడు నెలలు దాటుతుందని కానీ ఇప్పటివరకు అక్రమ కట్టడాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. చింతూరు అధికారులకు అక్రమ కట్టడదారుల నుంచి ఎంత సొమ్ము అందిందో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన చింతూరు ఎమ్మార్వో నీ తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులందరిపై సమాచార హక్కు చట్టం కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
