పయనించే సూర్యుడు అక్టోబర్ 29,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో “మొంథా” తుఫాను కారణంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలెవరు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సరాసరి సగటు వర్షపాతం మూడు సెంటీమీటర్లు నమోదయిందని కలెక్టర్ తెలిపారు. అత్యధికంగా రుద్రవరం మండలంలో 5 సెంటీమీటర్లు, నంద్యాల అర్బన్‌లో నాలుగు సెంటీమీటర్లు, సిరివెళ్ల, గోస్పాడు, శ్రీశైలం, నంద్యాల రూరల్, ఆళ్లగడ్డ, మహానంది, కోవెలకుంట్ల, చాగలమర్రి, ఆత్మకూరు మండలాల్లో మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయిందన్నారు. తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి అని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు.విద్యుత్ స్తంభాలు, తెగిన విద్యుత్ తీగలు, వాగులు, వంకలు, చెరువులు, కెనాల్లు వంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లరాదన్నారు. మట్టిమిద్దెలలో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి పశుసంపదను కాపాడుకోవాలన్నారు. తుఫాను, వర్షం సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 – 293903 కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.

