పయనించే సూర్యుడు. జనవరి 27. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
* అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు చేరాలి…. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు
* రైతులు లాభసాటి ఆయిల్ పామ్ పంట సాగు చేయాలి
* ఖమ్మం లోని 15వ డివిజన్ లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు చేరాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
సోమవారం మంత్రి, ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ లో పర్యటించి 8 కోట్ల 45 లక్షలతో అల్లీపురం నుండి రామకృష్ణపురం వరకు, అల్లీపురం నుండి జంగాల కాలనీ వరకు, అల్లీపురం ఎన్.టి.ఆర్. విగ్రహం నుండి ధంసలాపురం వరకు చేపట్టిన 3 రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలు ఇక్కడ కొంత మంది రైతులు బాగా వేసారని, మిగిలిన రైతులు కూడా ఆయిల్ పామ్ కు మారాలని, ఎకరానికి 52 వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని, మిర్చి, పత్తి, వరి పంటల కంటే అధికంగా లాభం వస్తుందని, మూడు సంవత్సరాల వరకు కూరగాయలు, ఇతర అంతర పంటల వల్ల ఆదాయం వస్తుందని అన్నారు. భూములు ప్రస్తుతం బంగారంతో సమానమని, మన దగ్గర వాతావరణం, ఎరువుల బట్టి తెగుల్లు వస్తున్నాయని, పత్తి, మిర్చి పంటల దిగుబడి తగ్గిపోతుందని, రైతులు ఈ అంశాలను గమనించాలని, ఆయిల్ పామ్ పంటతో కోతుల బాధ, తుఫాను ఇబ్బంది ఉండదని అన్నారు. 15వ డివిజన్ లో ఉన్న విద్యుత్ స్తంభాలు మార్చిన తర్వాత బీటీ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం మనం చేసే పని 10 కాలాల పాటు ఉండాలని, రోడ్డుపై ర్యాంపులు తొలగించా లని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించామని, 500 గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి పథకాలు అమలు చేశామని అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, రైతు భరోసా పథకాలు ప్రారంభించామని అన్నారు. పేద ప్రజలకు సంబంధించిన పథకాలు పేదలకు అందేలా చూడాలని, గ్రామాలలో అసలైన అర్హులకు పథకాలు చేరాలని, ఎవరైనా అనర్హులు పథకాలకు ఎంపికైతే అధికారులకు సంపూర్ణ సమాచారం అందించాలని మంత్రి సూచించారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం 40 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని అన్నారు. రైతు భరోసా క్రింద వ్యవసాయం చేయని భూములకు సహాయం తొలగించాలని అన్నారు. రైతు భరోసా క్రింద ఎకరానికి 12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. అనర్హులకు పథకాలు చేరితే అభివృద్ధి కుంటు పడుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం 25 వేల కోట్లు కావాలని, రైతు భరోసా క్రింద 10 వేల కోట్లు ఇస్తున్నామని, రుణమాఫీ క్రింద 21 వేల కోట్లు, రైతు బీమా క్రింద 3 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టామని, అక్కడ ప్లాస్టిక్ నిషేధమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహా రావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇఇ యుగంధర రావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, కార్పొరేటర్లు కరుణ, కమర్తపు మురళి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.