
పయనించే సూర్యుడు బాపట్ల మే :-8 రిపోర్టర్ (కే శివకృష్ణ )
సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి సాధించి భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేసిన మహాకవి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని ప్రముఖ సాహితీవేత్త అబ్దుల్ ఖాదర్ జీలాని పేర్కొన్నారు .సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారు పేటలో జరిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతి సభకు అబ్దుల్ ఖాదర్ జీలాని అధ్యక్షత వహించారు. నోబెల్ బహుమతి పొందిన” గీతాంజలి” కావ్య సంపుటిలో ఠాగూర్ భగవంతుని ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పారని తెలియజేశారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ మాట్లాడుతూ ఆచార్య ఆత్రేయ మనసు కవిగా ప్రఖ్యాతి నొందారన్నారు. వారు దాదాపు 477 చిత్రాలకు 1600లకు పైగా పాటలు రచించి తెలుగు ప్రేక్షకులను సాహితీ సాగరంలో ఓలలాడించారని పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రి రావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించిన అమరవీరుడు అని ప్రశంసించారు.సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అల్లూరి సీతారామ రాజు గడగడ లాడించారని వివరించారు .సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఆత్రేయ కేవలం పాటలే కాక 150 పైచిలుకు చిత్రాలకు సంభాషణలు కూడా రచించి తెలుగు ప్రేక్షకులను రంజింప చేశారన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ ఠాగూర్ భారత జాతీయ గీతం అయిన “జనగణమన” గీతాన్నే కాక బంగ్లాదేశ్ జాతీయగీతమైన “అమర్ సోనార్ బంగ్లా” గీతాన్ని కూడా రచించి విశ్వకవి గా ప్రఖ్యాతి చెందారన్నారు. ఈ సభలో ఏం జాకబ్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామ చంద్రమూర్తి కాళీదాసు తదితరులు ప్రసంగించారు.