Tuesday, July 22, 2025
Homeఆంధ్రప్రదేశ్అస్తిత్వం కోల్పోతున్న కోయ కోయ భాష.కోయ భాషతోనే కోయ జాతికి మనుగడ..

అస్తిత్వం కోల్పోతున్న కోయ కోయ భాష.కోయ భాషతోనే కోయ జాతికి మనుగడ..

Listen to this article


జులై 21 విశ్వ ఆదివాసి భాషల దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక వ్యాసం


పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జులై 20 ప్రపంచంలో ఎన్నో జాతులు, కోట్లాది మనుషులు, వేలాది భాషలు. ఒక్కొక్క దేశానికి ఒక దేశ భాష ఉంటే ఆ దేశంలో అనేక రాష్ట్రాలు ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర భాష, ప్రతి రాష్ట్రంలో జిల్లాలు జోన్లు, డివిజన్లు మండలాలు పంచాయతీలు గ్రామాలు గా విభజించబడి ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఉన్న మానవజాతి ఒకటే అయినప్పటికీ భౌగోళిక స్వరూపం ఆధారంగా ఆయ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు అనుగుణంగా మానవజాతి పరిణామం చెందింది. మనిషి ఆదిమ జాతిగా ఉన్నప్పుడు మొదటగా తన ఆహారం అవసరాల కోసం ఒకచోట నుంచి మరొక చోటకి వలస పోతూ ఉండేవారు ఈ క్రమంలో మానవ మేదస్సు పరిణామం, అభివృద్ధిచెందుతూ మనిషి వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఆక్రమం లోనే విడివిడిగా జీవించే జాతులు ఒకచోటగా గుంపులుగా నివసించే పరిస్థితికి వచ్చాయి. మొదటిలో ఆదిమానవుడు ఇతర వ్యక్తుల తోటి ఒకరికొకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి ఒక రకమైన శబ్దాలతోటి సైగలు తోటి వారి మధ్య భావాలను పంచుకునేవారు. ఈ క్రమలోనే మనిషి స్వర పేటికలో మార్పులు రావటం ఒక గుంపులో నివసించే మానవజాతి ఒక రకమైనటువంటి శబ్దాన్ని సృష్టించటం దానిని ఒక సమాచారానికి సంకేతంగా ఉపయోగించుకుంటూ చివరికి ఒక క్రమబద్ధమైన మాటను మాట్లాడగలిగాడు. ఇవన్నీ కూడా మానవమేధస్సులోని జరిగిన పరిణామ క్రమంలోని పురోగతులు. ఇలా ప్రపంచ నలుమూలల విస్తరించిన మానవజాతి ఒక్క గుంపుగా ఒక్కో ప్రాంతంగా చివరికి ఒక్కొ దేశంగా ఏర్పడ్డాయి. ఇలా భూగ్రహం మీద కేవలం 30 శాతం భూమి ఉండే ప్రాంతంలో సుమారుగా 200 దేశాలకు పైగా ప్రస్తుతం ఏర్పడి ఉన్నాయి. దేశాల సంఖ్య తక్కువ అయినప్పటికీ మానవజాతుల యొక్క భిన్నత్వం నైసర్గిక స్వరూపం భౌగోళిక పరిస్థితులు ఆధారంగా ప్రపంచం మొత్తం పదివేలకు పైగా భాషలు ఉనికిలో వచ్చాయి. ఇలా ఏర్పడిన భాషలు ఆయా భాషలకు లిపిలు ఆయా జాతులు వారు కనిపెట్టి వాటిని ఒక క్రమబద్ధంగా మాట్లాడటం అనుసరించడం వలన ఈరోజు లిపి ఉన్న భాషలు మనుగడ కొనసాగిస్తున్నాయి అలాగే లిపి ఉన్న భాషల్లో ఆధునిక నాగరికత నూతన అభివృద్ధి సాధ్యపడింది. అయితే లిపిలేని కొన్ని వేల భాషలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇందులో 90 శాతం పైగా భాషలు ఆదిమ సంస్కృతిని ఆదిమ నాగరికతను పాటిస్తున్న జాతులవే. ఇప్పుడు అంతరించిపోయే భాషల్లో కోయ భాష నిలిచింది.డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం ప్రకారం చూస్తే “సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్” పుస్తకం ఆధారంగా మనుగడు కోసం పోరాడే జీవులే తర్వాత తరాలలో మిగిలి ఉంటాయి. అంటే మనుగడ కూడా భాష పై ఆధారపడి ఉంటుంది భాష అనేటటువంటిది సంస్కృతిలో ఒక భాగం. ప్రపంచంలో అనేక రకాల భిన్న సంస్కృతులు ఉన్నాయి. అయితే భారతదేశ విషయానికొస్తే మిగిలిన ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో విభిన్న సంస్కృతులు కాస్త ఎక్కువే. కారణం ఈ దేశంలో ఉండే ఆదివాసీలు వాళ్ళ సంస్కృతి. ఆధునిక నాగరికతలో బ్రతుకుతున్న మానవజాతులతో పోలిస్తే ఆదిమ నాగరికత జీవిస్తున్నటువంటి ఆదివాసీల జీవనశైలి విభిన్నమైనది. ఆదివాసుల సంస్కృతి ఇతర సంస్కృతలతో మిళితం కాదు. అయితే ఆదివాసి సంస్కృతి విచిన్నమైతే ఆదివాసి మనుగడ వారి ఉనికి, అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని బ్రిటిష్ పాలనలోనే కనుక్కున్న బ్రిటిష్ పాలకులు ఆదివాసి ప్రాంతాల్లోకి ఇతర జాతీయులు చొరబడకుండా ఎన్నో చట్టాలు ఎన్నో హక్కులు కల్పించబడి ఉన్నారు. అయితే స్వతంత్రం తర్వాత భారత ప్రభుత్వం ఆదివాసుల సంస్కృతి పరిరక్షణ కై పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఆదివాసి స్వతంత్ర పోరాట అమరవీరుల త్యాగాల ఫలితంగా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కృషితో ఆదివాసుల రక్షణ సంక్షేమం అభివృద్ధి కోసం భారత రాజ్యాంగంలో ఐదవ, ఆరవ షెడ్యూల్నీ రచించి ఎన్నో హక్కులు కల్పించబడి ఉన్నారు. అయితే దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్లు స్వతంత్రం అనంతరం భారత పాలకులు ఆదివాసీల యొక్క రక్షణ కోసం ఉన్న చట్టాలను అమలు చేయలేదు హక్కులను దక్కేలా చేయలేదు. దీని మూలాన ఏజెన్సీ ప్రాంతాల్లోకి నాన్ ట్రైబల్స్ విపరీతంగా వలసలు వచ్చి ఆదివాసి ప్రాంతంలో ఉండే ఖనిజ సంపదను భూములను అడవి సంపదను మరియు ఇతర వనరులను దోచుకోవటం మొదలుపెట్టారు. అంతేకాక ఆదివాసి భూభాగంలోని స్తిష్ట వేసి స్థిరనివాసాలు వేసుకొని స్థిర వ్యాపారాలు క్రయవిక్రయాలు మొదలుపెట్టాడు. వీటన్నిటికీ ఐదవ షెడ్యూల్ భూభాగంలో నిషిద్ధం ఉన్నప్పటికీ పాలకులు ఏజెన్సీలోని ఖనిజ సంపదను దోచుకోవడానికి ఆదివాసీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ కు సకల సౌకర్యాలు కల్పించి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఏజెన్సీలో పెంచి పోషించారు. నేడు విద్యుత్, వైద్యం, విద్య అందని ఎన్నో ఆదివాసి గుడాలు ఉన్నాయి కానీ, ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న నాన్ ట్రైబల్స్ గ్రామాల్లో ఏ ఒక్క కొరత లేదు, నాన్ ట్రైబల్స్ ఉండటానికి అన్ని రకాల వసతులు మంచినీరు విద్య వైద్యం రహదారు సౌకర్యాలు పుష్కలంగా కల్పించారు. కానీ మాతృభూమిలో మాత్రం ఆదివాసులకు మౌలిక సదుపాయాలు రాజ్యాంగ పలాలు అందరిని ద్రాక్షగా మిగిలిపోయాయి. ఆదివాసి భూభాగంలోకి ఎప్పుడైతే నాన్ ట్రైబల్స్ వలసలు మొదలయ్యాయో అప్పుడే ఆదివాసుల మనుగడ ప్రమాదంలో పడింది, సంస్కృతి విచ్చిన్నమైసాగింది, సంస్కృతిలో భాగమైన కోయ భాష తోపాటు ఇతర ఆదమ తెగల భాషలు అంతరించిపోయే ప్రమాదంలో పడిపోయాయి. మనిషి పరిణామక్రమం ఇంతగా మార్పు చెందడానికి ప్రధాన కారణం అతని యొక్క అస్తిపంజరం, ఆస్తిపంజరం కారణంగానే ఏ ఇతర జీవికి లేని తెలివితేటలు మనిషికి వచ్చాయి. అలాగే ప్రతి మానవజాతికి అస్తిపంజరం లాంటిది తన ఆస్తిత్వం. మనిషి అస్తిపంజరం లేకుంటే ఎలా మారిపోతాడో, మనుగడ సాగిస్తున్నటువంటి మానవజాతులకు కూడా అస్తిత్వం లేకుంటే ఆయా జాతుల పరిస్థితి కూడా అంతే. ఇక్కడ కోయ తెగకు ప్రధాన రక్షణ తన అస్తిత్వం. తన అస్తిత్వానికి ప్రధాన రక్షణ తన ఉనికి. తన ఉనికి ప్రధాన రక్షణ తన మనుగడ. తన వనగడికి ప్రధాన రక్షణ తన సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగమైన భాషే కోయ భాష. కోయ జాతి కోయ భాష మాట్లాడుతుంది కాబట్టే ఆ జాతికి కోయ తెగ గా పేరు వచ్చింది. మరి కోయ భాష మాట్లాడకపోతే వారు కోయ తెగ, కోయ జాతి గా ఎలా పిలవబడతారు.? ఎలా గుర్తించ బడతారు!?. కులాలు అనేటటువంటివి మనిషి మూర్ఖత్వంతో పెట్టుకున్న విభజన, కానీ జాతులు పుట్టుక అనేటటువంటిది వారు మాట్లాడే భాష వాళ్ళ సంస్కృతిలో భాగంగా ఏర్పడినవి. కానీ నేడు అనేక కులాలు వారు వారి జాతి అస్తిత్వం కోసం పోరాటం చేయకుండా కులం పేరు కోసం కొట్టుకుంటున్నారు. కులం పోయిన మనిషి బతకగలడు కానీ జాతుల అస్తిత్వాలు పోతే తమ జాతుల భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోవడం కాయం. నేడు ప్రధానంగా కోయ జాతిలో జరుగుతున్న ప్రమాదకరమైనటువంటి సంఘటన ఇదే. కోయ జాతి ప్రాంతాల్లోకి గిరిజనయేతురుల వలసలు పెరిగి క్రమంగా వాళ్ళ జనాభా శాతం పెరగటంతో, కోయ జాతి జనాభా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో గిరిజనఏతరులు వారి వ్యాపార స్వలాభం కోసం వారి మనుగడ కోసం కోయ భాషను నేర్చుకుంటే , కోయ జాతి వారు మాత్రం గిరిజనఏతరుల సంస్కృతి, భాష మత్తులో పడిపోయారు. కొత్త భాషలు నేర్చుకోవటం లో తప్పులేదు కానీ తన అస్తిత్వానికి మూలాధారమైనటువంటి కోయ భాషను వీడి ఇతర భాషలపై మోజు పెంచుకొని కోయ భాషను పూర్తిగా మర్చిపోయి తమ పిల్లలకు కూడా కోయ భాషను నేర్పించకుండా పరాయి భాషలపై ఆధారపడుతూ, పరాయి భాషలతోనే విద్యను అభ్యసించడం వలన కోయ జాతి వినాశనానికి కోయలే నాంది పలికారు. ఈ విషయంపై ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కోయ జాతి నివసించే ప్రాంతాలలో, కోయలకు వారి ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక పాఠశాలలో కోయ భాషలో బోధన అందించటం అనివార్యం. అలాగే కోయ జాతి కూడా మేల్కొని తన మాతృభాష అయిన కోయ భాషను వారు మాట్లాడుతూనే వారికి పుట్టే భావితరాలకు కూడా కోయ భాషను కోయ సంస్కృతిని నేర్పించాల్సిన ప్రధాన బాధ్యత ఉంది. హక్కులు అడిగేవారికి బాధ్యతలు కూడా తెలియాలి. తమ జాతి ఉనికి కోసం ఆలోచించలేని వాడికి భారత రాజ్యాంగంలోని హక్కులు కావాలని అడిగే హక్కు లేదు. ప్రభుత్వాలకు కావలసింది కూడా ఇదే. ఆదివాసీలు తమ సంస్కృతిని ఎప్పుడు వదిలిపెడతారు, ఎప్పుడు పరాయి సంస్కృతిలో విలీనమై పోతారో అప్పుడు ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు తొలగించబడతాయి. హక్కులు కోల్పోబడతాయి. భూమి నీరు అడివి అందులోని వనరులు కోసం ఆదివాసి పూర్వీకులు ఎంతోమంది పోరాటం చేసి వీర మరణం పొందారు, అంతేకాక ఈ దేశం పరాయి పాలకుల చేతిలో ఉన్నప్పుడు స్వరాజ్యం కోసం మొట్టమొదటిగా పోరాటం చేసింది కూడా ఆదివాసులు. ఆనాడు వారెవరు కూడా చదువుకోలేదు. చదువు లేని ఆ రోజుల్లోనే ఆదిమ నాగరికతతోనే ఆదిమ సంస్కృతి తోనే ఆదివాసులు వారి యొక్క మనుగడ కోసం, స్వతంత్రం కోసం పోరాటం చేస్తే వాటి ద్వారా వచ్చిన హక్కులను అనుభవిస్తూ నేడు ఎన్నో చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఆదివాసీలు వారి సంస్కృతిని వారే నాశనం చేసుకుంటున్నారు. దీని నుండి కోయ జాతిని మరియు దేశంలోని అన్ని ఆదివాసి తెగల భాషల సంరక్షణ కోసం ఆదివాసీ పెద్దలు ఐక్యం అయ్యి 2018 జూలై 21న ఢిల్లీలో జరిగిన సదస్సు నిర్వహించారు. ఆరోజునే ” విశ్వ కోయ( గోండి) భాషా దినోత్సవం” జూలై 21 ని ఏర్పాటు చేశారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం జూలై 21న విశ్వ కోయ ( గోండి)భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. కావున కోయ జాతి వారు ఒక్క జూలై 21న రోజు మాత్రమే భాషా సంబరాలు చేసుకోకుండా ప్రతి రోజూ కూడ తమ కుటుంబీకులతో కోయ భాషలోనే మాట్లాడి, పుట్టే వారి బిడ్డలతో కూడ కోయ భాషే మాట్లాడాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కోయ భాషలోనే ప్రాథమిక విద్య బోధన జరపాలి కోయ బాషా ఉపాధ్యాయులను ప్రతి పాఠశాలలో నియమించాలి. కోయ భాషతోపాటు ఇతర ఆదివాసి తెగల భాషలను 8వ షెడ్యూల్లో చేర్చి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. అప్పుడే కోయ భాష మరియు ఇతర ఆదివాసి భాషలు మనగడలో ఉంటాయి, రక్షించబడతాయి. మరియు కోయ జాతి అభివృద్ధి చెందుతుంది. లేకుంటే కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో జాతుల, భాషల సరసన కోయ భాష, కోయ జాతి మిగిలిపోతుంది. భవిష్యత్తులో కోయ జాతి ఉండేది అని భావితరాలు పుస్తకాలలో చదవటం కూడా మనం చూస్తామో చూడమో తెలియదు. కావున కోయ జాతి బిడ్డలు మేలుకోని జాతి మనుగడ కోసం కోయ భాషను రక్షించుకోవాలి.
ఇట్లు కుంజా శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.సెల్:7995036822 మెయిల్: srinukunja9 25@gmail.com , srinukunja55@gmail.com.(నోట్: జూలై 21 విశ్వ కోయ ( గోండి) భాషా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments