పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆ దృశ్యాన్ని తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
అది బెంగళూరుకు బయలుదేరిన ఒక ప్రైవేట్ వోల్వో బస్సు. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై ఆ బస్సు వేగంగా వెళ్తోంది. అనుకోని విధంగా ఒక ద్విచక్రవాహనం వచ్చి బస్సును ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందకు దూసుకెళ్లింది.ఏం జరిగిందో తెలుసుకునే లోపే, బస్సు ముందు భాగం నుండి ఒక్కసారిగా మంటలు లేచాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి..బస్సులో ఉన్న వారంతా నిద్ర మత్తులో ఉన్నారు. కొందరికి మెలకువ వచ్చి, భయంతో హాహాకారాలు చేశారు.కానీ, వారికి బయటకు వెళ్లే దారి దొరకలేదు.ఆ మంటలు వారిని చుట్టుముట్టాయి.కొందరు ప్రాణ భయంతో అద్దాలు పగలగొట్టుకుని, ఎలాగోలా బయటపడ్డారు. వారికీ తీవ్ర గాయాలయ్యాయి..కానీ, మిగతా వారికి అంత అదృష్టం దక్కలేదు. నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. సుమారు ఇరవై మందికి పైగా నిండు ప్రాణాలు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బస్సు పూర్తిగా కాలిపోయి, కేవలం అస్థిపంజరంలా మిగిలింది.ఆ దృశ్యం… రోడ్డు పక్కన కన్నీరుమున్నీరవుతున్న బంధువులు, తమవారిని గుర్తుపట్టడానికి కూడా వీలు లేని విధంగా కాలిపోయిన మృతదేహాలు… ఆ కుటుంబాలకు తీరని విషాదం, ఆ వేదన వర్ణించలేనిది. హైదరాబాద్ నుండి సంతోషంగా ప్రయాణమైన వారు, చిన్నటేకూరు వద్ద మంటలపాలై, కుటుంబ సభ్యులకు కడసారి చూపు కూడా దక్కకుండా అయిన ఆ దృశ్యం.. నిజంగా గుండెను మెలిపెడుతోంది.


