
పయనించే సూర్యుడు. ఏలూరుజిల్లా స్టాఫ్ రిపోర్టర్ (శరత్). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్త్రీ శక్తి” ఉచిత ప్రయాణ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై విజయవాడలోని ఆర్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, ఎండీ ద్వారకా తిరుమల రావు, విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, జోనల్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ మహిళల కోసం ఉచిత ప్రయాణ పథకాన్ని వచ్చే నెల 15వ తేదీ (ఆగస్టు 15) నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఎండీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధారంగా ఈ సౌకర్యం కల్పించబడుతుంది అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయమని ప్రభుత్వం స్పష్టం చేసింది.