
- పట్టించుకోని అధికారులు..
రుద్రూర్ లో ఇండియన్ పెట్రోల్ బంక్..
రుద్రూర్, మార్చ్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): ఉరుకులు, పరుగుల జీవితం..యాంత్రిక జీవన విధానంలో పేద, మధ్య తరగతి వర్గాల్లో అధిక శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులకు విధిగా అందించాల్సిన సేవలు కొన్ని ఉన్నాయి మీకు తెలుసా? తాగునీటి వసతి, మరుగుదొడ్లు, గాలి మిషన్ ఇలా.. ఈ సౌకర్యాలన్నీ బంకుల యజమానులు ఉచితంగా అందించాల్సినవే. కానీ రుద్రూర్ మండల కేంద్రంలోని పలు పెట్రోల్ బంక్ లలో ఏయిర్ మిషన్, మరుగుదొడ్లు, ఫోన్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు ఏమి లేవని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మౌలిక వసతులు ఇలా .. ప్రధానంగా బంకుల యజమానులు వినియోగదారులకు ఎయిర్ మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వార వినియోగదారులకు ఉచితంగా ఎయిర్ అందించాల్సి ఉంటుంది. డబ్బులు మాత్రం అడుగవద్దు. బంకు వద్ద ప్రథమ చికిత్సకోసం ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేసి వాటిలో ఉండే మందులపై గడువు తేదీ తప్పకుండా ఉండాలనే నిబంధన ఉంది. గడువుతేదీ అయిపోతే వాటిని వెంటనే బాక్స్ నుంచి తొలగించాలి. తాగనీరు, ఉచిత ఫోన్ సౌకర్యం, మరుగుదొడ్లు, ఫిర్యాదు బాక్స్, పెద్ద అక్షరాలతో ధరల పట్టిక, ఫైర్‌సేఫ్టీ డివైజర్స్, బిల్లు ఇవ్వడం, క్వాంటిటీ, క్వాలిటీకోసం 5లీటర్ల క్యాన్ ఇలా ప్రతిబంకులో వినియోగ దారులకు సౌకర్యాలు ఉండాలని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలకు ఆయా యజమానులు వాటికి మంగళం పాడుతున్నారు. కొంతమంది నిర్వాహకులు వినియోగదారులతో సఖ్యత లేకుండా దురుసుగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంకుల్లో ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారులు మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రతీ పెట్రోల్ బంకును ఆకసిక్మంగా తనిఖీలు చేసి 10సౌకర్యాలను పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక వినియోగదారులు కోరుతున్నారు.
