
పయనించే సూర్యుడు మార్చి 22 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు పని కోరే ప్రతి ఒక్కరు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న పనులన్నిటిని త్వరితగతిన పూర్తి చేయడానికి గాను, పని కొరకు చూసే ప్రతి కూలి హాజరుకావాలని కలెక్టర్ కోరారు. ఉపాధి హామీ పథకం పనికోరు వారందరూ 23-03-2025 నుండి 29-03-2025 వరకు వారం రోజులు వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు మరియు ఆర్థిక సంవత్సరం ముగింపు ఉన్నందున పనులు పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున కూలీలు హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించి ప్రతి వ్యవసాయ భూమిలో ఫామ్ పౌండ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు.బోర్ ద్వారా వ్యవసాయం చేసే ప్రతి రైతు వ్యవసాయ భూమిలో కచ్చితంగా నీటి గుంటల నిర్మాణం చేపట్టాల్సిందే అని కలెక్టర్ స్పష్టం చేశారు.