
పయనించే సూర్యుడు నవంబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మెట్ట ప్రాంత అభివృద్ది తోడుగా మేకపాటి కుటుంబం . మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్వంత నిధులతో కంపసముద్రం, బాటలో వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం మెట్ట నియోజకవర్గమైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల అభివృద్దికి మేకపాటి కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.మర్రిపాడు మండలం కంపసముద్రం. బాట గ్రామాల్లో స్వంత నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్ లను ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి ఫృద్విరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల అభివృద్దికి తామెప్పుడూ ఉంటామని, పిలిస్తే పలికే దూరంలో ఉంటామని అన్నారు. ఎన్నికల సమయంలో ఎందరో మభ్య పెట్టే మాటలు చెబుతుంటారని, తాము అలా కాదని, చెప్పిన మాట మీద నిలబడుతామన్నారు.కంపసముద్రం, బాట గ్రామాల్లోని కాలనీల్లో తాగునీటి సమస్య ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్వంత నిధులు వెచ్చించి ప్రజలకు అందుబాటులో ఉండేలా వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు.
స్థానికంగా ఉండేవారు ఘర్షణలకు, తగవులను ఎన్నికలకు తీసుకురాకుండా గ్రామాభివృద్దికి అందరం కృషి చేద్దామని, మన ప్రాంత క్షేమం కోరే వారికి ప్రజలంతా తోడుగా నిలవాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు. మేకపాటి కుటుంబం మన ప్రాంత అభివృద్దికి ఎప్పుడూ ముందుటుందని అన్నారు.
తాను శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో విద్యాభివృద్ది కోసం ఎంతో తోడ్పాటునందించామని. ఇక్కడ డిగ్రీ కళాశాల. ఇంజనీరింగ్ కళాశాల. పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయంబర్స్ మెంట్ కారణంగా మన ప్రాంతంలో కూడా విద్యాధికులు అధికంగానే ఉన్నారన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెస్ ఛార్జీలు కూడా విద్యార్థులకు తీసుకురావడంతో ఇంకా చదువుకునే వారి సంఖ్య పెరిగిందని, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్నికల సమయంలో మభ్య పెట్టేందుకు చేసే పనులు కావని, ఇంకా ఎన్నికలకు మూడున్నర సంవత్సరాలు ఉందని, మన ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మన ప్రాంత అభివృద్ది కోసమే శ్రమిస్తున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేకపాటి వారంటే గొప్ప పేరు ఉందని, అక్కడ హాజరైన ఓ వ్యక్తి మేకపాటి కుటుంబం అంటేనే రెండు రాష్ట్రాల్లోని గొప్ప పేరుందని చెప్పుకొచ్చారని, ప్రముఖ నటులు చిరంజీవి దగ్గరి బంధువే ఈ మాటలు చెప్పారని, అదే మేకపాటి కుటుంబం తెచ్చుకున్న పేరు అన్నారు.మేకపాటి కుటుంబం ఎప్పుడూ సంపాదించిన దాంతోనే అందరికి మంచి చేయాలనే కృషి చేశామని, ఇప్పటి వరకు ఇతరుల సొమ్ము ఆశించలేదని, అది మాకు దేవుడిచ్చిన గుణమని పేర్కొన్నారు. హైలెవల్ కెనాల్, రిజర్వాయర్ మన ప్రభుత్వంలో పూర్తవుతుందని, రిజర్వాయర్ పూర్తయితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతానికి ఇచ్చిన వరమని, దివంగత మంత్రి గౌతమ్ రెడ్డితో కూడా ఈ విషయం చెప్పానని, కంపసముద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో తప్పకుండా రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పారని, అయితే ఆయన నాకంటే ముందుగానే మనల్ని వదిలివెళ్లిపోయారని, తప్పకుండా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మా కుటుంబం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
