
పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కళా, సేవారంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా సన్మానం
కవులు, కళాకారులను ఆదరించాలి : బిసి రాజా రెడ్డి
బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డిని కర్నూల్ ఉత్సవ్ కార్యక్రమంలో నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రం నందు శనివారం రాత్రి కర్నూల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళా, సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా బిసి రాజా రెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజులు బిసి రాజారెడ్డికి శాలువా కప్పి పూలమాలతో సన్మానించి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా బిసి రాజారెడ్డి మాట్లాడుతూ,సమాజంలో ఎప్పుడైతే కవులు, కళాకారులను ఆదరించి గౌరవిస్తే విలువలు పెరగడంతోపాటు ప్రజలలో చైతన్యం వస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఒకప్పుడు కవులు, కళాకారులకు పుట్టినిల్లు లాంటివన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వారికి ఆదరణ కరువవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని కవులు, కళాకారులను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో లలిత కళా సమితి చైర్మన్ పత్తి ఓబులయ్య, గజల్ గాయకుడు మహమ్మద్ మియా, ప్రముఖ వక్త ఇనయతుల్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి పాల్గొన్నారు.
