

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 29 చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ కొండ్రు రమేష్ బాబు మంగళవారం స్థానిక విలేకరులకు ఒక ప్రకటన లో తెలిపారు. గత ఏడాది ప్రథమ సంవత్సరంలో 218 మంది చేరగా, ఈ ఏడాది అడ్మిషన్లు సంఖ్య ఇప్పటికే 240 దాటిందని పేర్కొన్నారు. విద్యార్థుల అడ్మిషన్లు పెరిగేందుకు కృషి చేసిన సిబ్బందిని ప్రిన్సిపాల్ అభినందించారు. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు తో పాటు నోట్ పుస్తకాలు అందజేయడం వంటి కీలక అంశాలు విద్యార్థులు చేరేందుకు కారణాలు కాగా మరో పక్క తల్లిదండ్రుల వద్దకు అధ్యాపకులు వెళ్ళి అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించడం కూడా సానుకూల ఫలితాలు ఇచ్చిందన్నారు. మరో వైపు ఎఫ్ ఏ సి విధానాలకు స్వస్తి పలికి రెగ్యులర్ ప్రిన్సిపల్స్ నియామకం , సైన్స్ విద్యార్థులకు ఏం సెట్,నీట్, మొదలగు పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు ఖాళీ గా ఉన్న పోస్టుల స్థానంలో అతిధి అధ్యాపకుల చే భర్తీ చేయడం వంటి చర్యలు అడ్మిషన్లు సంఖ్యను పెంచేందుకు ఎంతో దోహదం చేశాయని ప్రిన్సిపాల్ రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 31 వ తేదీ వరకు పదోతరగతి పాసైన విద్యార్థులు ఇంకా ఎవరైనా ఉంటే కళాశాలలో ప్రవేశం పొందవచ్చని ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.