
రహదారిపై టెంట్ వేసి వాహనాలు అడ్డగింత
పయనించే సూర్యుడు మార్చి 20 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం, కోయగూడెం ఉపరితల గని నుంచి వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల ద్వారా వస్తున్న దుమ్ము దూళితో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంటూ సింగరేణి అధికారులను, వారి వాహనాలను రేగులతండా గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం మండల కేంద్రం దాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో రేగులతండా నుండి దాస్ తండా వరకు రోడ్డు విస్తీర్ణంలో భాగంగా పనులు మొదలుపెట్టిన గుత్తేదారు పనులు మధ్యలో ఒదిలిపెట్టాడు. దాంతో రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న రేగులతండా, దాస్ తండా గ్రామస్తులు దుమ్ము దూళితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు అనేకసార్లు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని విజ్ఞాపనలు, నిరసనలు చేశారు. సింగరేణి అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేశారు. అయినా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో . గ్రామస్తులు నిరసనను చేపట్టారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవతో సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై టెంటు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.