
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 09. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
- తల్లిదండ్రులకు భగవంతుడు ఇచ్చిన ఆత్మీయ కానుక ఆడపిల్ల జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
- ప్రేమానురాగాలకు ప్రతీకైన అమ్మాయి పుట్టడం అదృష్టం
- అమ్మాయిలను బాగా చదివించాలి
- సన్నబియ్యం లబ్ధిదారులైన అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి భోజనం
- సారధినగర్ లో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం తల్లిదండ్రులకు భగవంతుడు ఇచ్చిన ఆత్మీయ కానుక అని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
మా పాప మా ఇంటి మణి దీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణం సారధి నగర్ లోని మౌనిక – సురేష్ దంపతులకు 2025, మార్చి 1న ఆడపిల్ల జన్మించిందని, ఈ సందర్భంగా బుధవారం ఈ కుటుంబానికి జిల్లా కలెక్టర్ స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, బట్టలు, సర్టిఫికెట్ అందించి తల్లిదండ్రులను, అత్తమామలు ఆరూరి మంగమ్మ, ఆరూరి నరసింహాలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు భగవంతుడు ఇచ్చిన ఆత్మీయ కానుక ఆడపిల్ల అని, ఆడపిల్ల పుడితే భారంగా భావించకుండా అదృష్టంగా భావించి అమ్మాయి ఆశించిన మేరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడి సొంత ఆదాయ వనరులు సంపాదించుకున్న తర్వాత మాత్రమే పెళ్ళి గురించి ఆలోచించాలని, ఆడపిల్లల భావాలకు గౌరవం ఇవ్వాలని తెలిపారు. ఇంటిలో అమ్మాయిలు ఉంటే ఇల్లు కళ కళ లాడుతుందని, ప్రతి ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలని, కుటుంబానికి గొప్ప పేరు తీసుకుని వస్తుందని అన్నారు. మౌనిక – సురేష్ దంపతుల కోరిక మేరకు పెద్ద పాప రితికకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం గావించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సన్న బియ్యం అందిన వివరాలు తెలుసుకుని, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే. రామ్ గోపాల్ రెడ్డి, ఖమ్మం అర్బన్ మండల తహసిల్దార్ రవి కుమార్, సిడీపీఓ వీరభద్రమ్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
