•టీటీడీ ఈ.వో. శ్యామలరావు, అడిషినల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి బాధ్యతల నిర్వహణలో విఫలం
•అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోంది
•మృతుల ఇళ్లకు టీటీడీ సభ్యులు వెళ్ళి క్షమాపణలు కోరాలి
•టీటీడీ వ్యవహారాల్లో ప్రక్షాళన మొదలవ్వాలి… వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టిపెట్టాలి
•తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రదేశం పరిశీలన…
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 10:-రిపోర్టర్ (వీ చెంచయ్య )
క్షతగాత్రులకు పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తప్పు జరిగింది.. బాధ్యత తీసుకుంటాము అన్నారు. మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరినీ క్షమించమని ప్రభుత్వం కోరుతోంది అన్నారు.
గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగిపట్టెడ ప్రాంతంలోని పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద సాయి, జిల్లా జాయింట్ కలెక్టర్, చిత్తూరు ఎస్పీ, డిఎస్పీలతో చర్చించారు. ప్రమాదానికిగల కారణాల గురించి ప్రశ్నించారు.
అక్కడి నుంచి స్విమ్స్ కు చేరుకొని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారినీ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలి. వారు తమ బాధ్యతల నిర్వహణలో విఫలం అయ్యారు. వారి మధ్య, పాలక మండలి మధ్య గ్యాప్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో పోలీసులు బాధ్యత తీసుకోవాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదని భక్తులు చెబుతున్నారు. టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జగిరింది? పోలీసు శాఖ నిర్లక్ష్యంపై సి.ఎం.దృష్టికీ, డీజీపీ దృష్టికీ తీసుకువెళ్తాను. •ప్రక్షాళన మొదలు కావాలి
తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నాము. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి. ప్రక్షాళన మొదలు కావాల్సిన అవసరం ఉంది.ఈవో శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు ఛైర్మన్ మేల్కొవాలి. వి.ఐ.పి.లపై కాదు సామాన్యులకు దర్శనాలపై దృష్టిపెట్టాలి. మృతుల కుటుంబాల దగ్గరకు టీటీడీ సభ్యులు, అధికారులు వెళ్ళి క్షమాపణలు చెప్పాలి” అన్నారు.
తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి
RELATED ARTICLES