రైతులకు పంట రక్షణ, సమీకృత వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచనలు
పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :మండలంలోని తంగిళ్ళ తండా గ్రామంలో గురువారం తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి మరియు పత్తి పంటలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యక్షంగా సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతు గాంధీకి చెందిన వరి పొలాన్ని సందర్శించి పంట పరిస్థితిని సమీక్షించారు. పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల పంట మరింత నష్టానికి గురయ్యే అవకాశం ఉన్నందున వెంటనే నీటి నిల్వను తొలగించి, వరి కోతను త్వరితగతిన చేపట్టాలని రైతులకు సూచించారు. పంట నష్టాన్ని తగ్గించుకోవడమే కాకుండా రైతుల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా చూడటం అత్యవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్ పత్తి సాగు చేస్తున్న రైతులు పత్తి అనంతరం మునగ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. మునగ సాగు చేయడం ద్వారా ఇప్పటికే జిల్లాలో చాలామంది రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని మునగ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని సూచించారు. అదేవిధంగా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా బోరు సౌకర్యం ఉన్న వారు, సగం భూమిలో ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.కలెక్టర్ రైతులకు సమీకృత వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వ్యవసాయం పట్ల సృజనాత్మక దృష్టితో ముందుకు సాగుతూ, పంటలతో పాటు కౌజు పిట్టల పెంపకం, మేకల పెంపకం, గేదెల పెంపకం, చేపల పెంపకం, కూరగాయల సాగు వంటి అనుబంధ జీవనోపాధులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం విస్తృతమవుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా వ్యవసాయం స్థిరంగా నిలవడమే కాకుండా రైతుల ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందని ఆయన వివరించారు.పంట రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులనుఆదేశించడంతోపాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ప్రతి రైతు సమస్యకు త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఏ డి ఏ లాల్ చంద్, వ్యవసాయ శాఖ అధికారి అన్నపూర్ణ మరియు సంబంధిత శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

