
పయనించే సూర్యుడు ఆగస్టు06 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్ తో కలిసి పాల్గొని, జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని రాష్ట్ర పండుగ లాగా నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపట్టానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచి సలహాదారులుగా పని చేశారని, తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని కలెక్టర్ పేర్కొన్నారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉందని, స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసారని, రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం రూపొందించారని , ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, సిపిఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, డి సి ఓ రుక్మిణి మరియు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.