
పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
- పారిశుద్ధ్యంపై అవగాహన పెంపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామిరెడ్డి తెలుగుగంగ ప్రాజెక్టు నంద్యాల కార్యాలయంలో శనివారం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుగంగ నంద్యాల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తో కలసి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుగంగ సూపరింటెండింగ్ ఇంజనీర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మనం పనిచేసే ప్రదేశం, నివసించే ప్రాంతం శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా, సక్రమంగా నిర్వాహించటం ప్రతి పౌరుడి కర్తవ్యంగా భావించాలి, అని అన్నారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, ఇది సమాజం మొత్తానికి ఉపయోగపడే ప్రజా ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, మనందరం చిన్నచిన్న చర్యల ద్వారా పెద్ద మార్పు తీసుకురాగలమని దశరథ రామిరెడ్డి సూచించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. కార్యక్రమం చివర్లో సిబ్బందికి పర్యావరణ పరిరక్షణ, చెత్త వర్గీకరణపై అవగాహన కల్పించే సెషన్ కూడా నిర్వహించారు.