
వైఎస్సార్సీపీ నాయకుల వినతిపత్రాలు సమర్పణ
ఆత్మకూరు నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగుల పించన్లను వెంటనే పునరుద్దరించాలని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎంపీడీఓలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధివంచితులైన దివ్యాంగుల పట్ల మానవతా దృక్పదంతో ఉండాల్సింది బదులు వారిని తీవ్రంగా వేధిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష దివ్యాంగుల పించన్లను తొలగించడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు.విధి వంచితులైన దివ్యాంగులు ప్రభుత్వం వారు ఇచ్చే పించను పైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఈ పించను మీదే వారి బతుకు ఈడుస్తున్నారని, అలాంటి వారికి పించన్లు కత్తిరించడం దారుణమని అన్నారు. దివ్యాంగులు తమ రోజువారీ జీవనం కోసం పించన్లపైనే ఆధారపడుతున్నారు కాబట్టి ఈ పించన్ల తొలగింపు వల్ల వారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.వైద్యం, ఆహారం, ఇతర ప్రాధమిక అవసరాలకు పించను నగదు ఇప్పటి వరకు ఆసరాగా నిలిచేది, ఇలాంటి వారి పించను తొలగించడంతో వారు డబ్బులకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని, దివ్యాంగులు ఇప్పటికే సమాజంలో అనేక సవాళ్లను, అవమానాలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ జీవనం సాగిస్తున్నారని, పించను తొలగింపు వారి జీవన ప్రమాణాలను మరింత దిగజార్జి సామాజిక అసమానతను పెంచుతోందన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల కోరిక మేరక ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సదరం క్యాంపులు పెట్టి వైద్యులతో అన్ని పరిశీలినలు చేయించి పించన్లు ఏర్పాటు చేశారు. పించన్ల తొలగింపునకు సంబంధించి సరైన కారణాలు, సమాచారం దివ్యాంగులకు అందించలేదు. 80 శాతానికి పైగా వైకల్యం కళ్ల ముందు కనిపిస్తున్నా సరే పించను కట్ చేయడం తీవ్ర విచారకరమని, తొలగించిన దివ్యాంగుల పించన్లను తక్షణమే పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాలన్నారు. అర్హులైన ఏ ఒక్క లబ్దిదారుకూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
