
పయనించే సూర్యుడు మార్చి 27 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాయాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.బుధవారం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మరియు శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లు, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,84,502 మెట్రిక్ టన్నుల కాగా అందులో సన్నరకం 99,729 మెట్రిక్ టన్నులు మరియు దొడ్డు రకం దాన్యం వస్తుందనే అంచనాతో 144 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి అదనపు దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతన్న పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పనకు ఏ, బి గ్రేడ్ రకాలుగా విభజించి మద్దుతు ధర ప్రకటించినట్లు చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యం 2320, బి గ్రేడ్ రకం 2300 రూపాయలుగా మద్దుతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ,హమాలీలు వడ దెబ్బకు గురి కాకుండా టెంట్లు, షెడ్ నెట్‌లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి నీడ ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ నియంత్రణకు వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ చేసిన ప్రకారం రైతులకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాటుపై చెక్ లిస్టు జారీ చేస్తామని, ఆ ప్రకారం ఏర్పాట్లు చేసి ధృవీకరణ నివేదికలు అందచేయాలని చెప్పారు. మన జిల్లాకు సమీప రాష్ట్రాల నుండి దాన్యం వచ్చే అవకాశం ఉన్నందున నియంత్రణకు సరిహద్దులో 8 చెక్ పోస్టులను ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు పండించిన ప్రతి దాన్యం గింజను కొనుగోలు చేయాలని చెప్పారు. కొనుగోలు చేసిన దాన్యాన్ని ఏ రోజు కారోజు ఆన్లైన్ చేసి రైస్ మిల్లులకు తరలించాలని దిగుమతిలో జాప్యం జరుగకుండా రైస్ మిల్లర్లు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియపై ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. దాన్యం విక్రయాలు నిర్వహణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల రైతులకు మంచి ధర లభిస్తుందని, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించు విధంగా రైతులను సన్నద్ధం చేయాలని చెప్పారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సెంటర్ ఇన్చార్జిపైనా, మిల్లర్లుపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు విక్రయాలు నిర్వహణకు వచ్చునపుడు ఆధార్, బ్యాంకు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సు వెంట తెచ్చుకోవాలని చెప్పారు.రైతు యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఆధారంగా రైతు యొక్క రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని,గన్నీ సంచులు కూడా సిద్ధంగా ఉంచాలని, ఆన్లైన్ చేసిన రైతులకు మాత్రమే గన్ని సంచులు ఇవ్వాలని చెప్పారు. గన్నీ సంచులు తీసుకున్న రైతుల వివరాలను రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలియన్లు, మాయిశ్చర్స్ సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద బ్యానర్లలో రైతులకు తెలియజేసే విధంగా ఎం ఎస్ పి వివరాలు, నాణ్యత ప్రమాణాలు అధికారులను సంప్రదించవలసిన వివరాలు తెలియపరచాలి. సన్న వడ్ల కౌంటర్ మరియు దొడ్డు వడ్ల కౌంటర్ బ్యానర్లను ప్రదర్శించాలి. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు మంత్ర ఐరిస్ స్కానర్ ద్వారా మాత్రమే కొనుగోలు పూర్తి అవుతుందని, డేటా ఎంట్రీ పూర్తి చేసేటప్పుడు రైతు కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తూకపు బాట్లు తనిఖీ చేసి సీల్స్ వేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలనిఅధికారులకు సూచించారు.సీఎంఆర్ 2024-25 ఖరీఫ్ సంబంధించి డెలివరీలను సకాలంలో చేయు విధంగా రైస్ మిల్స్ ను తనిఖీ చేసి నివేదికలు అందించవలసిందిగా పౌరసరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ధాన్యం మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, డిఆర్డిఓ విద్యచందన , పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్, పౌర సరఫరాల అధికారి రుక్మిణి, డిసిఓ కుర్షిథ్ , వ్యవసాయ అధికారి బాబురావు , జిసిసి మేనేజర్ విజయకుమార్ , తూనికలు కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రెస్ మిలర్ అసోసియేషన్ నుండి ఆనందరావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు