
పయనించే సూర్యుడు అక్టోబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు అవుతోందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, నాణ్యతలో లోపాలు ఉన్నా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రివర్యులు ఫరూక్ స్వయంగా విద్యార్థినీ విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, రుచిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల డీఈవో జనార్ధన్ రెడ్డి , మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్, ఉర్దూ డిఐ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
