
పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్ కు ఈ రోజు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఘనంగా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలను జిల్లా కేంద్రమైన నంద్యాలలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని తెలిపారు. ఈ నూతన క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే, అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు మెరుగైన వసతులు, ప్రత్యేక చికిత్సలు ఇక్కడే అందించడానికి అవకాశం ఉంటుందని, తద్వారా స్థానిక ప్రజలు మెరుగైన వైద్య సేవలు కోసం ఇతర నగరాలకు వెళ్లవలసిన అవసరం తప్పుతుందని వివరించారు. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ సోహెల్, కౌన్సిలర్లు శ్రీదేవి, జైనాబి, ఖండే శ్యామ్ సుందర్ లాల్, మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, కామిని మల్లికార్జున, ప్రముఖ పారిశ్రామికవేత్త పబ్బతి వేణు, బ్యాంకు తిమ్మయ్య, జెపి , వేద సాయినాథ్, మున్నా, నాగేశ్వరరావు, విజయ గౌరీ, పద్మ, జోష్ణ, భారతి, నాగరత్నమ్మ , గుద్దేటి వెంకటేశ్వర్లు, సాయిరాం, ఎబినేజర్, కోమలి మధు, శ్రీకాంత్ నాయుడు , జోసెఫ్ , దూదేకుల దస్తగిరి , తోటరామయ్య, కాజా శంకర్ తదితరులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
