
పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం మరువకముందే బాపట్ల జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న కారును లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా…మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మకు సమీప బంధువులుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
కారును ఢీకొట్టిన లారీ బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడు సంగీత్ కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది.బాపట్లలోని పాండురంగాపురంలో ఈ సంగీత్ వేడుక జరిగింది. ఈ సంగీత్ వేడుకలకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులు అయినటువంటి బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మీ, గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజులు హాజరయ్యారు. సంగీత్ వేడుక ముగిసిన అనంతరం ఇంటికి వెళ్తుండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కర్లపాలెం మండలం సత్యవతిపేట దగ్గర వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారు మీదకు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు,స్థానికులు కలిసి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు క్రేన్ సాయంతో వాహనాలను రహదారి నుండి తొలగించారు. ఇకపోతే నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇద్దరుబాలురకు ఎలాంటి ప్రాణాపాయం లేదని త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. సంగీత్ కార్యక్రమంలో మృతులంతా పాల్గొని ఎంతో ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సందడి చేశారు. ఇంతలోనే వారిపై ఎవరికి కన్ను కుట్టిందో ఏమో ఇలా లారీ వారిపాలిట మృత్యువుగా మారింది. ఇకపోతే ఈ ప్రమాదంతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధిత కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలియజేశారు.