Wednesday, January 29, 2025
Homeఆంధ్రప్రదేశ్నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలి - స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి....

నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ

Listen to this article

* పయనించే సూర్యుడు. జనవరి 28. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్

* ఫిబ్రవరి 10న మాత్రలు వేయించాలి

* ఫిబ్రవరి 10న మిస్ అయిన పిల్లలకు ఫిబ్రవరి 17న మాత్రలు వేయాలి

* 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి మాత్రలు వేయించాలి

* జనవరి 30 నాడు గ్రామాలలో కుష్టు వ్యాధి పై అవగాహన కల్పిస్తూ గ్రామసభ నిర్వహణ

నులిపురుగుల నివారణ, కుష్టు వ్యాధి నివారణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమీక్ష
నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నులిపురుగుల నివారణ, కుష్టు వ్యాధిగ్రస్తుల చికిత్స అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ఫిబ్రవరి 10 న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో 19 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న పిల్లలందరికి తప్పనిసరిగా మాత్రలు వేయించాలని అధికారులకు సూచించారు.
నులి పురుగులు చాలా ప్రమాదకరమని, వీటి వల్ల రక్త హీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వీటిని నివారిస్తే ఆరోగ్యంగా వుండవచ్చునని అన్నారు. జిల్లాలోని 1840 అంగన్వాడి కేంద్రాల్లోని 74 వేల 641 మంది ఒకటి నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు, 1618 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలోని, జూనియర్ కళాశాలల్లో గుర్తించిన మొత్తం 2 లక్షల 36 వేల 676 మంది విద్యార్థులు, మొత్తం 3 లక్షల 11 వేల 317 మంది ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను వేయాలని అన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం, ప్రైవేట్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలకు నులి పురుగుల మాత్రలు ఏ పి.హెచ్.సి. నుంచి వెళ్ళాలో మ్యాప్ చేసి పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో అవసరమైన మేర నులిపురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉంచుకున్నామని అధికారులు అదనపు కలెక్టర్ కు వివరించారు. 1339 మంది ఆశావర్కర్లు, 1739 మంది అంగన్వాడి టీచర్లు, 1260 మంది వైద్య సిబ్బంది నులి పురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గోంటారని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10 నాడు మాత్రలు అందించని విద్యార్థులకు తప్పనిసరిగా ఫిబ్రవరి 17 నాడు అందించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలకు ముందస్తు సమాచారం అందించి పూర్తి స్థాయిలో విద్యార్థులు ఆ రోజు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
గ్రామాలలో స్థానిక నాయకులు, పంచాయతి కార్యదర్శులు సైతం తమ గ్రామాలో పూర్తి స్థాయిలో విద్యార్థులకు మాత్రలు అందేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ప్రతి పిల్ల వాడికి తప్పనిసరిగా మాత్రలు అందే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని, పాఠశాలలకు జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవ నిర్వహణ, మాత్రల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. నులిపురుగుల నివారణ మాత్రల కార్యక్రమం విజయవంతంగా చేస్తే అనీమియా వంటి వ్యాధుల విస్తరణ తగ్గిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమం అమలుపట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ ఒక విద్యార్థి మిగలకుండా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మాత్రలు అందజేయాలని అన్నారు. జనవరి 30 నాడు గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని, మనకు కుష్టు వ్యాధిగ్రస్తులు తగ్గుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ వ్యాధి వస్తుందని అన్నారు. ఒంటిపై ఎలాంటి మచ్చలు ఉన్న వైద్యులను సంప్రదించాలనే అవగాహన ప్రజలకు కల్పించే దిశగా ఈ గ్రామ సభలు జరపాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. బి. కళావతి బాయి, ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణ అధికారి, అడిషనల్ డి.ఎం. అండ్ హెచ్.ఓ. డా. వెంకట రమణ, డిఇఓ సోమశేఖరశర్మ, డిడబ్ల్యూఓ కె. రాంగోపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments