
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 22. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ టెన్నిస్ క్రీడ మనిషిలోని నైపుణ్యతను, క్రీడాస్ఫూర్తిని చాటుతుంది ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓటమి అంచు వరకు వెళ్లి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే చివరికి విజయం సాధించవచ్చనే స్పూర్తి మనకు టెన్నిస్ క్రీడా ఇస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ (కే.డి.టి.ఏ.) అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను శనివారం జిల్లా కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు.సర్దార్ పటేల్ స్టేడియం చుట్టూ తిరిగి కలెక్టర్ సౌకర్యాలను, టెన్నిస్ కోర్టులను పరిశీలించారు. టోర్నమెంట్ నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కలెక్టర్ ట్రయల్ మ్యాచ్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను ప్రదర్శించి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు ఖమ్మం వేదికైందని అన్నారు. మంచి కోర్టు, అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం మన జిల్లాలో ఉన్న టెన్నిస్ అసోసియేషన్ చిత్తశుద్ధికి నిదర్శనమని కలెక్టర్ ప్రశంసించారు. రాబోవు రోజుల్లో మరింతగా మన క్రీడా స్ఫూర్తి చాటుకునే లాగా టెన్నిస్ క్రీడను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. టెన్నీస్ తనకు చాలా ఇష్టమైన క్రీడ అని అన్నారు. ఖమ్మంలో టెన్నిస్ కోర్టు నిర్వహణ చాలా బాగుందని, ఇక్కడ పిల్లలకు టెన్నిస్ లో మంచి శిక్షణ అందిస్తున్న కోచ్ లు ఉండటం మనందరి అదృష్టమని అన్నారు.టెన్నిస్ క్రీడ ద్వారా మంచి ఫిజికల్ ఫిట్ నెస్, మెంటల్ స్టేబిలిటీ లభిస్తాయని అన్నారు. టెన్నిస్ క్రీడలో ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా విజయం సాధించవచ్చని, 5 సెట్లలో రెండు సెట్లు కోల్పోయి మూడవ సెట్ లో చివరి పాయింట్ దగ్గర నుంచి పోరాడీ విజయం సాధించిన మ్యాచ్ లు అనేకం ఉన్నాయని, ఫెదరర్, నాథల్, జకోవిచ్ లాంటి క్రీడాకారులు అనేక సార్లు ఓడిపోయే పరిస్థితుల నుంచి విజయం సాధించారని కలెక్టర్ తెలిపారు. మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చిన నిబద్ధతతో, నిజాయితీగా ఉంటూ ఓటమి ఒప్పుకోకుండా చివరి వరకు పట్టు వదలకుండా మన పని చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తామని, ఆ స్ఫూర్తి మనకు టెన్నిస్ క్రీడ అందిస్తుందని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు.టెన్నిస్ క్రీడ ఆడుతున్న సమయంలోనే పోటీ ఉంటుందని, గేమ్ ముగిసిన తర్వాత గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్పూర్తి ప్రతి ఒక్కరు పాటించాలని కలెక్టర్ సూచించారు. డబుల్స్ గేమ్ ద్వారా ఇద్దరు క్రీడాకారుల మధ్య సమన్వయం ఎలా ఉండాలో మనకు తెలుస్తుందని అన్నారు.భారతదేశం నుంచి మరో లియాండర్ పేస్, సానియా మీర్జా లాంటి టెన్నిస్ క్రీడాకారులు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆర్థికంగా సూపర్ పవర్ అవడంతో పాటు క్రీడలలో కూడా భారతదేశం మరింత రాణించాలని అన్నారు. జీవితంలో విద్యార్థులు క్రీడలు, చదువు, కుటుంబం, ఫ్రెండ్స్ అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలని కలెక్టర్ సూచించారు. మొదటి జాతీయ మ్యాచ్ ను కర్ణాటకకు చెందిన ఆర్యన్ మెహతా, మహారాష్ట్రకు చెందిన ఆదిత్య రానావడే అనే ఇద్దరు క్రీడాకారుల మధ్య తొలి మ్యాచ్‌ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ టాస్ వేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, ఏసీపీ కుమారస్వామి, ట్రాఫిక్ సిఐ సాంబశివరావు, టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చల్లపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి డా. అనిల్ కాసినేని, ట్రెజరర్ కాంపాటి సత్యనారాయణ, చీఫ్ రిఫరీ ప్రవీణ్ నాయక్, కాళ్ల పాపారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, కాళ్ల సూర్య, తదితరులు పాల్గొన్నారు.
