
పదవ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పయనించే సూర్యుడు మార్చి 20 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం రేపటినుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న ప్రతి విద్యార్థికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో ప్రాధాన్యతను గల పదవ తరగతి పరీక్షలు రేపటి నుండి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు. పది పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయి అని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో తదుపరి మీ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధించగలరని ఆయన తెలిపారు. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు మంచిగా స్పష్టంగా సమాధానాలు రాయాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లాలో 73 పరీక్ష కేం ద్రాలు ఏర్పాటు చేయగా 12,282 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 73 మం ది చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడుగురు రూట్ అధికారులు. 73 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 26 మంది సెంటర్ కస్టోడియన్లు, 73 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిళ్లను పోస్టా ఫీసులకు చేరవేసేందుకు పోలీసు బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద సిసి కెమెరాలు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించేందుకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి వేసే విధంగా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్ సర్వీస్ లు నడిపేలా ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని తద్వారా నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.