
- స్పందించని జిల్లా అధికారులు…
రుద్రూర్, ఏప్రిల్ 08 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
నెల నెల ఇచ్చే పింఛన్‌లో 16 రూపాయలు పోస్టాఫీస్ సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారని, పింఛన్ డబ్బులలో కోతలు ఎందుకు సారూ? అంటూ పింఛన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెలకు పింఛన్ డబ్బులు 2016 తీసుకోవాల్సి ఉండగా, 2000 రూపాయలు మాత్రమే చెల్లించి పోస్టాఫీస్ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని పింఛన్ దారులు వాపోతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్, బొప్పాపూర్, రాయకూర్, రాణంపల్లి, సులేమాన్ నగర్, రాయకూర్ క్యాంపు, చిక్కడపల్లి, సిద్దాపూర్, కొందాపూర్ తదితర గ్రామాల్లో వృద్ధాప్య, వికలాంగ, వితంతువు, బీడీ కార్మికుల పింఛన్ దారులు ఉన్నారు. వృద్దులకు, వితంతులకు, బీడీ కార్మికులకు రూ. 2016, వికలాంగులకు రూ. 4016 పింఛన్ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, వృద్ధులకు, వితంతులకు 2000 రూపాయలు, వికలాంగులకు 4000 రూపాయలు ఇస్తు 16 రూపాయాలు స్వాహా చేస్తున్నారని పింఛన్ దారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోస్టాఫీస్ లలో విధులు నిర్వహించే సిబ్బందికి మాత్రమే మిషన్లు అందజేసి వారే పింఛన్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బయట వ్యక్తులకు కూడా మిషన్లు అందజేసి పింఛన్ లు ఇస్తు, పింఛన్ డబ్బులలో 16 రూపాయలు స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ నుంచి కోతలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రుద్రూర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శ్రీకాంత్ కు వివరణ కోరగా, ఈ విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పింఛన్ దారులు కోరుతున్నారు.
