
జూన్ 15 నాటికి కెనాల్ లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా శుభ్రం చేయాలి..
సీతారామ కాలువల ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయాలి…
సీతారామ కెనాల్ పరిశీలనలో రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ సహకార,చేనేతమరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
పయనించే సూర్యుడుమే 09 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లోని సీతారామయ్య ఎత్తిపోతల పథకం అక్విడెక్ట్ ( సూపర్ ప్యాసేజ్ ) కూలిన పిల్లర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జోళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. పూసుగూడెం నుంచి కమలాపురం పంప్ హౌస్ కు వెళ్లే కాలువ మార్గంలో మాదాపురం దాటిన తర్వాత 48.3 కి. మీ. వద్ద సమీప గుట్టపై నుంచి వచ్చే నీళ్లు కాలువలోకి బదులుగా బయటకు వెళ్లేలా అక్విడెక్ట్ మొత్తం నాలుగు పిల్లర్లతో నిర్మించగా ఒక పిల్లర్ గత నెలలో కూలింది, కూలిన స్థానంలో కొత్త పిల్లర్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు నారాయణ మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం నాటికి పిల్లర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జూన్ 15 నాటికి కెనాల్ లో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా ఉన్న గడ్డి, చెట్లను మరియు చెత్తను శుభ్రం చేయాలని, వర్షాకాలం గోదావరికి నీటి ప్రవాహం రాగానే సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగర్ కెనాల్ కు నీటిని విడుదల చేయాలని, అప్పుడు నీటి ప్రవాహానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కెనాల్ ను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి సీతారామ కాలువలో ఉన్న మరమ్మత్తులు, మిగిలిన పనులు అన్ని పూర్తి చేసి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. సీతారామ కెనాల్ ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని అన్నారు. వచ్చే వర్షాకాలం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో ఉన్న చిన్న, మధ్యతరహ చెరువులు మరియు ప్రాజెక్టులను నింపడానికి సన్నద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు వద్ద ప్యాకేజ్ 9 పనులను మంత్రి పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ రమేష్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ జయలక్ష్మి మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.