Sunday, July 27, 2025
Homeఆంధ్రప్రదేశ్పెన్షన్ దారులకు గుడ్‌ న్యూస్‌…ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు

పెన్షన్ దారులకు గుడ్‌ న్యూస్‌…ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 27 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్‌ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక మీదట బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్‌ చెల్లించే విధానానికి స్వస్థి పలికి ఫేసియల్‌ రికగ్నిషన్‌ విధానంలో చేయూత పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 29 నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ర్టంలో సుమారు 44 లక్షల మంది పెన్షన్‌ దారులున్నారు. వారిలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత, గీత, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్‌ తదితర బాధితులున్నారు. అయితే వీరిలో చాలామంది ముఖ్యంగా వృద్ధుల వేళ్ల రేఖలు అదృశ్యమయ్యాయి. దీంతో ప్రతినెల పెన్షన్‌ తీసుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారి రేఖలు లేనందున బయోమెట్రిక్‌ సాధ్యం కావడం లేదు. దీంతో వారికి పెన్షన్‌ సకాలంలో రావడం లేదు. కొంతమంది పెన్షనర్ల నిధులను ఇతరులు కాజేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం ఫేసియల్‌ రికగ్నిషన్‌( ముఖ గుర్తింపు) విధానం అమలు చేయాలని నిర్ణయించింది. కాగా ఈ ఫేసియల్​ రికగ్నిషన్​ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం టీజీ ఆన్‌లైన్‌ సంస్థ నుంచి టెక్నికల్‌ సపోర్టు తీసుకుంటుంది. తొలిదశలో పోస్ట్​ ఆఫీస్ ల ద్వారా పెన్షన్లు పొందే 23 లక్షల మందికే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక బ్యాంకుల్లో పింఛన్లు పొందుతున్న 21 లక్షల మందికి మాత్రం ప్రస్తుత విధానమే అమలు చేస్తారు. ఈ కొత్త విధానం కోసం ప్రత్యేక యాప్​ను ప్రభుత్వం రూపొందించింది. ఈ విధానంపై అవగాహన కోసం పోస్టుమాష్టర్లు, పంచాయతీ సెక్రటరీలు, పోస్టుమ్యాన్​లు, బిల్​ కలెక్టర్లకు దీనిపై ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. దీంతో పోస్టు ఆఫీసుల ద్వారా పెన్షన్‌ పొందే వారు తమ ఫేసియల్​ రికగ్నిషన్ ద్వారా పెన్షన్‌ పొందే అవకాశం ఉంది. ఇక ఫేసియల్​ రికగ్నిషను అమలు చేయడం కోసం రూ.13 కోట్లతో 6,000 మంది పోస్ట్‌మ్యాన్‌లు, పోస్టుమాస్టర్లకు కొత్త ఫోన్ల కొనుగోలుకు చేయడానికి ఆర్డర్‌ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. శనివారం(ఇవాళ) పోస్టల్‌ సిబ్బంది, గ్రామ కార్యదర్శులకు ఫేసియల్​ రికగ్నిషన్​పై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వారు సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. సోమవారం పెన్షన్లకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మంగళవారం నుంచి కొత్త విధానాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. పోస్టాఫీస్‌కు వెళ్లిన వారి ఫొటో తీసి ఆధార్‌లో ఉన్న ఫొటోతో సరిపోల్చి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం వారికి పింఛను డబ్బులను చెల్లిస్తారు. ఎవరికైనా ఫొటోలు తీయలేని పరిస్థితి ఉన్నట్లయితే బయోమెట్రిక్‌ విధానం ద్వారానే పింఛన్​ ఇస్తారు. ఫేసియల్​ రికగ్నిషన్​, బయోమెట్రిక్​రెండూ పనిచేయని వారుంటే వారికి గ్రామ కార్యదర్శులు వేలి ముద్రలు వేసి పింఛన్​ అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పెన్షన్‌ వస్తోంది. వీరితో పాటు వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు కూడా ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తోంది. ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటి వరకు ఆధార్​ ఐడీ కార్డు లేదా డేట్​ ఆఫ్​ బర్త్ సర్టిఫికెట్/ వయసును సూచించే ఏదైనా కార్డు చూపిస్తే సరిపోయేది. కానీ ఇకమీదట ఆధార్​తో పాటు ఓటర్​ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం సైతం కావాలని కొన్ని చోట్ల అధికారులు తిరకాసు పెడుతుండటంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నివారించడం కోసం ఫేసియల్​ రికగ్నిషన్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments