
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
బెండలపాడు గిరిజన గ్రామంలో చారిత్రక ఘట్టం
పల్లె వీధుల్లో పండుగ వాతావరణం
గృహలక్ష్ముల కన్నీళ్లలో ఆనంద ప్రతిబింబం
చుండ్రుగొండ : బెండలపాడు గిరిజన గ్రామం బుధవారం చారిత్రక ఘట్టానికి వేదికైంది. పల్లె వీధుల్లో మంగళవాయుల స్వరాలు మార్మోగాయి. గృహలక్ష్ముల కన్నీళ్లలో చిరునవ్వులు మెరిశాయి. పిల్లల చేతుల్లో పూలదండలు ఊగిపోతూ, గడచిన దశాబ్దాలుగా ఎదురుచూసిన కలలు నేడు సాకారం అయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తలుపులు తెరిచి పేదల గృహప్రవేశం చేయించడంతో బెండలపాడు పల్లె అంతా పండుగ వాతావరణంలో తేలిపోయింది. ఒక గుడిసె నుంచి గౌరవ గడప దాకా సాగిన ఈ ప్రయాణం పేదవాడి ఆత్మగౌరవానికి కొత్త రూపం ఇచ్చింది.పేదల ఆనందమే నిజమైన గెలుపు పొంగులేటి
ఈ గృహప్రవేశాల వేడుకను పర్యవేక్షించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… “ఇది కేవలం గృహప్రవేశం కాదు. ఇది పేదవాడి గెలుపు. కులం, మతం, రాజకీయాలు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇదే ఇందిరమ్మ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం” అని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను నిర్వీర్యం చేసి పేదల కలలకు దెబ్బతీసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ శాఖను బలోపేతం చేసి లక్షలాది పేదలకు సొంతింటి కలను నిజం చేస్తున్నాం” అని తెలిపారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాటకు ఈ ఇళ్లే సాక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. “ఒక పేదవాడికి ఆత్మగౌరవం, భరోసా, భద్రత ఇవ్వడమే మా ధ్యేయం. పది సంవత్సరాలు పాలించిన వారు ఇళ్లు ఇవ్వలేకపోయారు. కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టి ఇళ్లు కట్టిస్తున్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 23 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత సాధించింది. ఇదే మా చరిత్ర. ఇక ముందూ పేదలకు మరింత పెద్ద స్థాయిలో గృహాలు అందజేస్తాం” అని స్పష్టం చేశారు. నల్గొండలో 90 ఏళ్ల వృద్ధురాలికి ఇల్లు ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబడలేదు. అదే ఊరికి మన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై 119 ఇళ్లు ఇచ్చాం. ఆ వృద్ధురాలికీ సొంతింటి గడప దాటే అదృష్టం కలిగింది. తన సొంత ఊరైన చింతమడకకే ఇల్లు ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ మన ప్రభుత్వం అక్కడ కూడా పేదలకు ఇళ్లు కట్టించింది” అని వ్యాఖ్యానించారు.
