Monday, January 27, 2025
Homeతెలంగాణప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సేవలు .... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సేవలు …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Listen to this article

పయనించే సూర్యుడు. జనవరి 27. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్. గుగులోత్ భావుసింగ్ నాయక్

* ప్రతి రోజూ సుమారు 69 వేల మహిళలకు అందుతున్న ఉచిత బస్సు ప్రయాణం

* 21 కోట్ల 31 లక్షల సబ్సిడితో 7 లక్షల 53 వేల గ్యాస్ సిలిండర్ లు సరఫరా

* ప్రతి నెలా 10 కోట్ల ఖర్చుతో 2 లక్షల 57 వేల గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా

* ఉగాది నాటికి మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు పూర్తికి చర్యలు

* 690 కోట్లతో మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు*

* మహిళల ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు

* గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి సందేశాన్నిచ్చిన జిల్లా కలెక్టర్
జిల్లా ప్రజల సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా నూతన రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.
గత సెప్టెంబర్ నెల మొదటి వారంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ వరదలు వచ్చాయని, ఆ క్లిష్టమైన పరిస్థితులలో వరద సహాయక చర్యలను సమర్ధవంతంగా, చిత్తశుద్దితో నిర్వహించి, ఖమ్మం పట్టణాన్ని యధావిధిగా పున:రుద్ధరించడంలో కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, అధికారులకు, సిబ్బందికి, స్వచ్చంద సంస్థలకు, సహకరించిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలాంటి మంచి జిల్లాలో కలెక్టర్ గా పని చేయడానికి అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
గత సంవత్సరం వచ్చిన భారీ వరదల వల్ల జరిగిన నష్టం పునరావృతం కాకుండా మున్నేరు నదికి ఇరువైపులా 8.5 కిలో మీటర్ల చొప్పున మొత్తం 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ ను దాదాపు 690 కోట్లు ఖర్చు చేసి నిర్మించడం జరుగుతున్నదని, పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.
ఖమ్మం జిల్లాలో ఒక లక్షా 31 వేల 723 మంది రైతులకు 908 కోట్ల 76 లక్షల రూపాయల మేర 2 లక్షల రుణ మాఫీ చేసినట్లు, 42 వేల 461 మంది రైతుల నుంచి 24 లక్షల 41 వేల క్వింటాళ్లకు పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి 122 కోట్ల 5 లక్షల రూపాయలు బోనస్ అందించడం జరిగిందని అన్నారు.
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం క్రింద జిల్లాలో ప్రతి రోజు సుమారు 69 వేలకు పైగా మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. 21 కోట్ల 31 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించి లబ్ధిదారులకు 7 లక్షల 53 వేల 723 సిలిండర్లను 500 రూపాయ లకే సరఫరా చేసినట్లు తెలిపారు. గృహా జ్యోతి పథకం క్రింద ఖమ్మం జిల్లాలో ప్రతి నెలా దాదాపు 10 కోట్ల సబ్సిడినీ ప్రభుత్వం భరించి 2 లక్షల 57 వేల 995 గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ క్రింద 22 వేల 856 మందికి 51 కోట్ల 25 లక్షల 24 వేల 645 రూపాయల మేరకు వైద్య సేవలు అందించామని అన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్ట్, చిన్న నీటి వనరులలో సాగునీరు అందించే ప్యాకేజీ 15 పనులు పూర్తి కాగా ప్యాకేజీ 14, 16 పనులు పురోగతిలో ఉన్నాయని , సత్తుపల్లికి సాగునీరు అందించే సత్తుపల్లి ట్రంక్ పనులు ( ప్యాకేజీ 9 & 10) వేగంగా జరుగుతున్నా యని అన్నారు. రఘునాథపాలెం మండలంలో 66 కోట్లతో చేపట్టిన మంచు కొండ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు ఉగాది నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
మహిళలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 20 స్త్రీ టీ స్టాల్స్, 4 మిల్క్ పార్లర్, 56 పాడి పశువుల యూనిట్ లు, 1260 బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, 9177 మైక్రో ఎంటర్ ప్రైజెస్, ఒక అమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేశామని, మధిర లో ప్రత్యేకంగా ఇందిరా మహిళా డెయిరీ ప్రారంభించడం జరిగిందని అన్నారు.
జిల్లాలోని 592 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేశామని, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ప్రారంభించామని, జిల్లాలోని 34 పాఠశాలల్లో వుయి కెన్ లెర్న్ అనే ప్రత్యేక కార్యక్రమం చేపట్టి పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందిస్తున్నామని, 51 పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేసామని, మరో 50 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశామని, డీఎస్సీ విజయ వంతంగా నిర్వహించి జిల్లాలో 520 టీచర్లను నూతనంగా నియమించడం జరిగిందని, కూసుమంచి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసుకున్నా మని, మధిర జూనియర్ కళాశాలలో 4 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం, సిరిపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు కావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో పాటు కామన్ డైట్ మెనూ ప్రారంభించామని అన్నారు.
ధరణి పోర్టల్ లో అన్ని మాడ్యుల్స్ లలో పెండింగ్ ఉన్న 70 వేల 60 దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. సహజ సిద్ద అందాలతో ఉన్న ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందితే టూరిస్టులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయనే లక్ష్యంతో ఖమ్మం ఖిల్లాకు 29 కోట్లతో రోప్ వే, 16 కోట్ల 75 లక్షలతో పాలేరు లేక్ పార్క్ వద్ద సుందరీకరణ, 2 స్పీడ్ బోటింగ్, ఎకో రీసార్ట్ కాటేజీలు, రెస్టారెంట్, తదితర అభివృద్ధి పనులను, 5 కోట్ల 82 లక్షలతో నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధి, 10 కోట్లతో మధిర పెద్ద చెరువు, 10 కోట్లతో జమలాపురం ట్యాంక్, 9 కోట్ల రూపాయలతో మామునూరు పేట చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తూ లైటింగ్, బోటింగ్, పిల్లల ప్లే ఏరియా వంటి వసతులు కల్పిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామని అన్నారు. యువత పరిశ్రమలు పెట్టేందుకు అన్ని విధాల సహకరిస్తూ, అభివృద్ధికి తోడ్పాటు అందించి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి రుణాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధికి నిర్మాణాత్మకమైన రీతిలో సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. రైతు, డాక్టర్, పోలీసు, సైనిక సేవలను చక్కగా ఆవిష్కరిస్తూ కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ బాల, బాలికలు చేసిన సాంస్కృతిక ప్రదర్శన విశిష్టంగా ఆకట్టుకున్నది.
స్వాతంత్ర్య సమరయోధులను గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జిల్లా కలెక్టర్, సీపీతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, ఫారెస్ట్ బీట్ అధికారులకు ప్రశంసా పత్రాలు, క్యాష్ అవార్డులను అందజేశారు. అనంతరం జిల్లా పౌర సరఫరాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోజనుల సంక్షేమం, విద్య, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, టి.జి. ఎన్.పి.డి.సి.ఎల్., అటవీ శాఖ, నగరపాలక సంస్థ- మెప్మా, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల స్టాల్ లను సందర్శించి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సీపీ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ విక్రమ్ సింగ్, అదనపు డిసిపిపు నరేష్ కుమార్, ప్రసాద్ రావు, ట్రైనీ ఎస్పీ , డి.ఆర్.ఓ. ఎం. రాజేశ్వరి, ఏసిపిలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీస్, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments