
ఓవర్ లోడ్ రవాణాపై అధికారుల చర్యలేవీ?
ఆర్టీసీ బస్సులకు ఫిట్నెస్, ఆక్యూపెన్సీ లిమిట్ వద్దా?
ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదు!
ప్రభుత్వంపై ఫైర్ అయిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు నవంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
నిన్న చేవెళ్ల మండలం, మీర్జాపూర్ దగ్గర జరిగిన టిప్పర్, బస్సు దుర్ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వరుసగా జరుగుతున్న రహదారి ప్రమాదాలకు ప్రభుత్వ రవాణా వ్యవస్థ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు. అనేక సంవత్సరాలుగా రద్దీగా ఉండే రహదారి విస్తరణ చేపట్టక వరుస ప్రమాదాలు జరుగుతున్న గత, ప్రస్తుత ప్రభుత్వాలు తమకు పట్టనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ఓవర్ లోడుతో వెళ్తున్న లారీలు, టిప్పర్లను రవాణా అధికారులు మామూళ్ల మాయలో పడి చూసి చూడనట్లుగా వదిలి వేయడం సామాన్యుల ప్రాణాలకు సంకటంగా మారిందని అన్నారు. ప్రభుత్వ ఉచిత హామీ వల్ల ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే మహిళ ప్రయాణికుల సంఖ్య పెరగడం కారణంగాను, ఆర్టీసీ బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం కారణంగాను, అధికారుల నిర్వహణ లోపం వల్ల బస్సుల్లో వరుస ప్రమాదాలు జరగడం బాధాకరం అన్నారు. నిన్నటి ఘటన 20 కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందని, ఏమిస్తే ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు అంటే విలువే లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు మోహన్ సింగ్, నరసింహ యాదవ్, సుధాకర్ అప్ప, కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపూర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.