
ఆర్డిఓ ఆదేశాలకు బేఖాతరు
పయనించే సూర్యుడు మే 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ప్రభుత్వ భూమి అని పెట్టిన హెచ్చరిక బోర్డులను చించి పారేసి తమకు సంబంధం లేని స్థలాలను లక్షలకు అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు
అనంతసాగరం మండల కేంద్రంలో ఇటీవల ఎటువంటి అర్హతలు లేకుండా నకిలీ ఐడి కార్డులతో బినామీ పేర్లతో ఇంటి పట్టాలు పొందిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఇక్కడ పని చేస్తూ ఉండే ఓ రెవెన్యూ అధికారి పట్టాలను అర్హతలు లేని వారికి అమ్ముకొని వెళ్లిపోయాడు. ఇక్కడి పట్టాల పంపిణీ లో జరిగిన మోసం గురించి ఫిర్యాదులు రావడంతో ఇదే విషయమై ఆర్డిఓ విచారణ జరిపి పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగిన విషయాన్ని గుర్తించి ఆ పట్టాలను రెవిన్యూ సిబ్బంది ద్వారా స్వాధీనం చేసుకోగా పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి వాటి నకళ్ళు జిరాక్సులు వారి వద్దనే ఉంచుకొని రెండు రోజులుగా ఆ స్థలాలను లక్షలకు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇచ్చిన పట్టాలు నకిలీవని తెలిసినా అమాయకులను మాయమాటలు చెప్పి ఆ స్థలాలను అమ్ముకునేందుకు అక్రమంగా పట్టాలు పొందినవారు రంగం సిద్ధం చేసుకున్నారు.వీరీ మాటలు నమ్మి అమాయకులైన ప్రజలు మోసపోకుండా అధికారులు అప్రమత్తమై ఈ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు చెబుతున్నారు..ఇంతటి ఘరానా మోసం జరిగి ఎటువంటి అర్హతలు లేని బినామీ దారులకు పట్టాలు ఇచ్చి తదుపరి స్వాధీనం చేసుకున్న స్థలం పై తమకు అర్హత లేదని తెలిసినా కూడా ఆర్డిఓ ఆదేశాలను బేఖాతలు చేస్తూ వాటిని అమ్ముకునేందుకు ఆక్రమణదారులు ప్రయత్నించడం ఎంతకు బలితెగించారో తెలుస్తుంది. వీరి ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయకపోతే వీరి చేతిలో అమాయకులు బలవుతారు.