
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి మేమంతా అండగా ఉంటాం
పయనించే సూర్యుడు మే 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వారు అమలు చేస్తామన్న పథకాలు, చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతు నొక్కేలా పాలన సాగుతోందని, ఇది ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుల మొదలు సామాన్యుడి వరకు కొనసాగుతుందని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కావాలనే ఇరికించారని, కావాలనే అరెస్ట్ చేయించారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నో హామిలను కూటమి ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు సంవత్సర పాలనలో వాటిని అమలు చేయలేక ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఇలా అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. ప్రజాక్షేత్రంలో బలమున్న నాయకులను అరెస్ట్ చేసి రాష్ట్రంలో వారు కోరుకున్న విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్సీపీ భయపడేది లేదని, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తామంతా అండగా ఉంటామని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్నవన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే చేసిన ప్రతి దానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని అన్నారు.