పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటిఉపేందర్ రావు )
భద్రాద్రికొత్తగూడెం:శుక్రవారంజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ఆసుపత్రుల్లో బయోవ్యర్థాలనిర్వహణసమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోగుల ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు.ఆసుపత్రుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వర్గీకరించి, ప్రత్యేక కంటైనర్లలో నిల్వ చేయడం, వాటిని గుర్తించిన సర్టిఫైడ్ ఏజెన్సీల ద్వారా సమయానికి సేకరించి శాస్త్రీయంగా పారవేయడం అనివార్యమని కలెక్టర్ సూచించారు. ప్రతి ఆసుపత్రిలో బయో వ్యర్థాల నిర్వహణ బాధ్యత వహించే నోడ్‌ల్ అధికారులు ఉండాలని, వారు ప్రతిరోజు రికార్డులను సక్రమంగా నమోదు చేసి, నియమిత సర్టిఫైడ్ ఏజెన్సీకి అందచేయాలని ఆదేశించారు.అసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిల్వ ప్రదేశాలు, సేకరణ విధానం, రవాణా వాహనాల శానిటేషన్ వంటి అంశాలపై పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని అన్నారు. పర్యావరణ కాలుష్యం నియంత్రణ మండలి (PCB) అధికారులు ఆసుపత్రులను తరచూ పరిశీలించి, బయో వ్యర్థాల నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం బయో వ్యర్థాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. సిబ్బందికి శిక్షణలు ఇవ్వడం, రక్షణ పరికరాలను ఉపయోగించడం, వ్యర్థాలను క్రమపద్ధతిలో నిర్వహించడం తప్పనిసరి అని కలెక్టర్ ఆదేశించారు.ఆర్ఎంపీలు లేదా ఇతర వ్యక్తులు బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో లేదా మున్సిపాలిటీ వ్యర్థాలతో కలిపినట్లయితే, కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై పెనాల్టీ విధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని, సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షణను ప్రయోగాత్మకంగా జిల్లా లో ఒక ప్రాంతంలో అమలు చేయాలని సూచించారు.మున్సిపల్ కమిషనర్లు ఆసుపత్రులు, ఆర్ఎంపీల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి, బయో వ్యర్థాల సురక్షిత నిర్వహణ, నియమావళి భద్రతా చర్యలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే, జిల్లావ్యాప్తంగా ఆసుపత్రులలో అవగాహన కల్పించేందుకు గోడపత్రికలను రూపొందించమని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన భద్రతా అధికారులకు ఆదేశించారు.సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి, డిసిహెచ్ ఓ రవిబాబు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డీ.ఈ. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సుజాత, మణుగూరు మున్సిపల్ కమిషనర్, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

