
(పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి నూతన ఆర్. ఓ.ఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి ఆర్.ఓ.ఆర్ చట్టంపై కొత్తూర్ మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో కలెక్టర్ భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందని అన్నారు. రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటితో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందని తెలిపారు. ప్రత్యేకించి రైతులకు భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని కానీ భూ భారతి చట్టం ద్వారా అన్ని సమస్యలు సులభంగా, పరిష్కరించడానికి అవకాశం ఉందని అన్నారు.ఈ చట్టం వల్ల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.అదే విధంగా రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ చేసే ముందు భూముల వివరాలు పూర్తి స్ధాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులు కూడా పరిష్కారమవుతాయని తెలిపారు. భూదార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలు, ఆబాది, రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో సరిత తహసీల్దార్, ఎంపిడివో, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.