Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్మత్తుతో జీవితం చిత్తుప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినం

మత్తుతో జీవితం చిత్తుప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినం

Listen to this article

పయనించే సూర్యుడు 25 తెలంగాణ స్టేట్ రీఛార్జి శ్రీనివాస్ రెడ్డి

అనేక కారణాల వల్ల మాదక ద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో, యువతలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. చాలామంది మద్యం, సిగరెట్లు, గంజాయి, కొకైన్‌ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. తద్వారా తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆ మత్తులో చెడుమార్గంలో పయనిస్తూ ఇటు కుటుంబానికి, అటు సభ్య సమాజానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. చిన్న వయస్సులోనే మత్తు పదార్థాలకు అలవాటుపడి చదువును పాటు చేసుకుంటున్నారు. ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువ జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు.. కాలేజీ క్యాంపస్‌లో గంజాయి పొగ.. ఇలా బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజీ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి వున్న డేగలు. జాగ్రత్త.. తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసి తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి. నెగెటివ్‌ కుటుంబ వాతావరణం టీనేజ్‌ పిల్లలు డ్రగ్స్‌ వైపు మొగ్గు చూపటంలో ప్రధానంగా నెగెటివ్‌ కుటుంబ వాతావరణం కూడా ఒక ముఖ్యకారణం. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా, పిల్లలతో మంచి అనుబంధం ఏర్పర్చుకోకపోయినా, ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్‌ ఇచ్చే డ్రగ్స్‌ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాల్లోకి పిల్లలు వెళ్తుంటారు. చదువుతోపాటు క్రీడలు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, బంధుమిత్రులు, క్రమశిక్షణల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయిన వారు ఉన్నారన్న భరోసా, విలువలు ఏదో ఒక ఆత్మీయ ఆలంబన వంటివి టీనేజ్‌ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్‌ బారిన ఏమాత్రం పడరు.సరదానే ముంచేస్తుంది
సరదా షికార్లు, స్లీప్‌ ఓవర్‌ల సమయంలో సరదా కొద్దీ సీనియర్లో, స్నేహితులో డ్రగ్స్‌ ఇస్తుంటారు. ఇవి తీసుకున్నాక ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్‌ ఉన్నాయో వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయి. తల్లిదండ్రులు మందలిస్తే ‘మీరిలా తిడితే ఇల్లు విడిచివెళ్లిపోతాం’ అంటూ బ్లాక్‌మెయిల్‌ కూడా చేస్తుంటారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషులుగా చేయాల్సి వుంది.
గమనిస్తూ ఉండాలి..గంజాయి తాగేవారి కళ్లు మిగతా వారికి భిన్నంగా, కాస్త ఎరుపు రంగులో ఉంటాయి. వీరు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు కాస్త తడబడుతూ ఉంటారు. శుభ్రతపై మక్కువపోయి, మాసిన దుస్తులతో తిరుగుతుంటారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు. ఎందుకని అడిగితే అదే ఫ్యాషన్‌ అంటూ సాకులు చెబుతుంటారు. గతంతో పోలిస్తే పాకెట్‌ మనీ ఎక్కువ కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుంటారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. పిల్లల నడవడిక, వారి అలవాట్లు, స్నేహాలు, చదువు మొదలైన వాటిని దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే మొదట కళాశాల, తర్వాత ఇంట్లో యువత ఎక్కువ గడిపేది. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది. అందువల్ల పిల్లలపై పర్యవేక్షణ కరువవుతుండటంతో వారు చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపుతున్నారు. లక్షణాలివే..శారీరక శక్తి, ప్రేరణ లేకపోవడం బరువు తగ్గడం లేదా పెరగడం అధిక శక్తి ఉండటం వంటివి ఉండొచ్చు.
నిర్లక్ష్యం చేయబడిన రూపం దుస్తులు, వస్త్రధారణ లేదా అందంపై ఆసక్తి లేకపోవడం పండ్లు తోముకోవడం, స్నానం చేయడం వంటి రోజువారీ పనుల్లో ఇబ్బందులు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం రహస్యంగా ఉండే ప్రయత్నాలు. కుటుంబం, స్నేహితులతో సంబంధాల్లో ఆకస్మిక, తీవ్రమైన మార్పులు
డబ్బుకోసం అభ్యర్థనలు, దొంగిలించేందుకు ప్రయత్నాలు భ్రాంతుల మధ్య బతుకుతారు గంజాయి పీల్చి డ్రైవింగ్‌ చేస్తే, వారికే కాక ఇతరులకూ ప్రమాదం. వారి మానసిక స్థితి క్రమేణా అధ్వానం అవుతుంది. వారు మనుషులు లేని చోట మనుషులను ఊహించుకుంటూ ‘హెలూసినేషన్స్‌’ అనే విచిత్ర అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది తరచూ వస్తూ ఉంటే, వారు క్రమేణా విపరీతంగా భీతిల్లుతూ, ఇతర వ్యక్తులు తమకు హాని తలపెట్టే ఉద్దేశంలో ఉన్నారని భావిస్తుంటారు. గంజాయి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు (లంగ్‌ క్యాన్సర్‌)కు హేతువు. పైగా ఎక్కువ కాలం గంజాయి వ్యసనం ఉంటే పురుషుల్లో పునరుత్పత్తి కణాలు తగ్గే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ గంజాయి పీల్చే అలవాటు ఉన్న స్త్రీలు గర్భవతులైతే, వారి శిశువులు అవయవ లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది.తల్లిదండ్రుల బాధ్యత
పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలు లేదా మాదకద్రవ్య వినియోగంతో ఇబ్బంది పడుతున్నట్లు తల్లిదండ్రులు ఎవరైనా భావిస్తే, వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవటం మేలు. యుక్త వయసులో ఉన్న వారు ఎక్కువగా మాదకద్రవ్యాల భారిన పడే అవకాశముందని వైద్య నిపుణులు చెప్తున్నారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయిని మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లితండ్రులు దృష్టి పెట్టాల్సిందేనని చెప్తున్నారు. లక్షణాలు కనిపించగానే డీఅడిక్షన్‌ సెంటర్లను సంప్రదించి, చికిత్సతో పాటు మానసిక కౌన్సెలింగ్‌ కూడా అందించాలని సూచిస్తున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్థుల్లా చూడటం మానేసి, వారిని డీఅడిక్ట్‌ చేసేందుకు సహకారం అందించాల్సిన అవసరముంది. దీనికి తల్లి తండ్రులు, డాక్టర్లు, మంచికోరేవారంతా సహకారం అందించాలి.మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు ఈనెల 19 నుంచి ఇరవై ఐదవ తేదీ వరకూ జరుగుతున్నాయి. నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌కి శవయాత్ర పేరుతో దిష్టిబొమ్మతో ర్యాలీ, మానవహారాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ విభాగాల ప్రభుత్వాధికారులు, విద్యా, ప్రయివేటు సంస్థలు కూడా ఇందులో భాగస్వాములవుతున్నాయి. అధికారులు, పలు స్వచ్చంద సేవా సంస్థలు, ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్‌ వాలంటీర్లు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. మత్తు పదార్థాలను విక్రయించినా, వినియోగిస్తున్నట్లు తెలిస్తే తక్షణమే పోలీస్‌ లేదా 1972 నంబర్‌కు సమాచారం అందిస్తే అరికడతారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments