
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
పూర్వకాలంలో పెద్దలు చెబుతారు. మామిడి చెట్టును చూస్తే జీవితం కనబడుతుంది. ‘లేత వగరు పిందె… యవ్వనం పులుపు.. మధ్య వయస్సులోని బింకం పండ్ల రసం.. వయస్సుతో వచ్చే అనుభవాల మాధుర్య సారం దీనిని పొగడ నా తరమా..’ అంటాడో కవి. అన్ని వయసుల వారిని అలరించి, పలకరించి కడుపు నింపే అమృత వృక్షం మామిడి. అందుకే అంటాడు ప్రముఖ హిందీ కవి గుల్జార్.. ‘మామిడి పండు అంటే ఒక తీయని అనుభవం మాత్రమే కాదు, చిన్ననాటి అనుభూతి, మధుర జ్ఞాపకాలు కూడా’ అని. మామిడిలో తీపి, పులుపు, అరుదైన సుగంధం వంటి భావ ప్రతీకలతో పాటు, శరీరాన్ని శీతలపరిచే ఔషధం, మనసును తీపిగా మార్చే అనుభవం వుందని ఆయుర్వేదం చెబుతుంది. మామిడిని ఉష్టమండల వాతావరణాలలో పండిస్తారు. ప్రపంచంలోని మామిడి సరఫరాలో దాదాపు సగం భారతదేశం నుంచే ఎగుమతి అవుతుంది. ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచే దేశంలో మామిడి సాగు చేస్తున్నారని చరిత్ర చెబుతోంది. వాణిజ్య రకాలు సహా మొత్తం 1500 రకాల మామిడిని పండిస్తారు. ఇవి మన సంస్కృతిలో భాగం అయిపోయాయి. మామిడి రుచి, దాని మాధుర్యాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను తలచుకుంటూ.. ప్రతి ఏడాది జులై 22న జాతీయ మామిడి దినోత్సవం జరుపుకుంటారు. ‘పాటలే తప్ప జీవితాలే వినిపించవు ఈ దేశంలో’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. రైతు పాట వినిపించదు. అతని విలాపం తప్ప. రైతు బతకడం సమాజానికి అవసరం. కానీ, మరణించాకే రైతుకు గుర్తింపు. ఇది మామిడి రైతుల విషాదగాధ కూడా. ‘మామిడి ఫలంలో తియ్యటి కవిత్వం దాగి వుంది’ అంటారో కవి. కానీ, మామిడిలోని మాధుర్యం రైతుల జీవితంలో కనబడదు. రాష్ట్రంలో మొత్తం 12 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే లక్ష ఎకరాల వరకూ రైతులు తోతాపురి రకం సాగు చేస్తున్నారు. నూజివీడు మామిడికి ప్రత్యేక గుర్తింపు వుంది. గత నాలుగేళ్లుగా నష్టాల్లో వున్న రైతులకు ఈ ఏడాది మామిడి దిగుబడి ఆశాజనకంగా మారింది. ఉత్పత్తి పెరగడంతో కిలో రూ.2, రూ.3 ధరకే పరిమితం చేసి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోపిడీ చేస్తున్నారు. నోరూరించే పచ్చళ్ల దగ్గర నుంచి జ్యూస్‌లు, జామ్‌ల వరకు కార్పొరేట్ కంపెనీలు పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. రైతుల పట్ల కనికరం లేకుండా ప్రభుత్వం పరిశ్రమలకు ఊడిగం చేస్తోంది. రైతులకు కిలో రూ.12 చొప్పున ధర రైతులను ఆదుకోవడానికి మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కేంద్రం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.తోతాపురి రకం మామిడి కిలో రూ.2లకే అడుగుతుండటంతో కాయలను తోటల్లోనే వదిలేస్తున్నారు. ఆశ చావని మరికొందరు రైతులు పల్ప్ పరిశ్రమలకు, మండీలకు తరలిస్తున్నారు. అక్కడ కూడా అదే ధర చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పంటను రోడ్డు పాలుచేసి, చమర్చిన కళ్లతో ఇల్లు చేరుతున్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అయినా దక్కేలా చర్యలు తీసుకోకపోతే… మామిడి రైతుల ఆత్మహత్యలను కూడా రాష్ట్రం చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. సాంకేతికతతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని చెబుతోన్న రాష్ట్ర ప్రభుత్వం.. సంప్రదాయకంగా వస్తోన్న పంటలను పక్కనపెట్టి, లాభసాటిగా వుండే తోటలను పెంచమని సలహా ఇస్తోంది. ఒక్క మామిడికే కాదు.. పామాయిల్, కోకో, పొగాకు, పసుపు, మిర్చి వంటి పంటలకూ ధరలేక రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం రైతుల సమస్యపై స్పందించాలి. రైతులను ఆదుకోవాలి. మనం తినే ప్రతి మామిడికాయ వెనుక ఒక రైతు కల వుంటుంది.. ఒక ఆశ వుంటుంది. ఆ కలను చెరపకుండా, ఆశను చంపకుండా చూడటమే.. నిజమైన బాధ్యత. అదే.. మామిడి జాతీయ దినోత్సవానికి నిజమైన అర్థం.