
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఆత్మకూరు పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలెక్టర్,ఎస్పీలకు సూచించారు. శనివారం ఉదయం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆత్మకూరు పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్‌తో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ మేనెల 1న సీఎం పర్యటన రూట్‌మ్యాప్, కార్యక్రమాల వివరాలు, బందోబస్తు తదితర అంశాలను ప్రధానంగా చర్చించారు. ఆత్మకూరులో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ వద్ద హెలీప్యాడ్, నారంపేటలో ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభోత్సవం, పైలాన్ ఏర్పాటు, మేడే సందర్భంగా నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కు వద్ద ఆటో కార్మికులు, గృహనిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులతో ముఖాముఖి, నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీ, ఆత్మకూరు ఏఎంసి గ్రౌండ్‌లో ప్రజావేదిక, పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాట్లపై మంత్రి ఆనం చర్చించారు.నారంపేటలోని ఎంఎస్‌ఎంఈ పార్కు పైలాన్ ఆవిష్కరణ, ప్రజావేదిక ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యాలయ మార్గదర్శకాల మేరకు చేపట్టాలన్నారు. నెల్లూరు పాలెం ఎస్టి కాలనీ లో పెన్షన్ ల పంపిణీ,యువత తో ముఖాముఖి ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. శాఖలవారీగా నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆత్మకూరు అభివృద్ధి, సమస్యలపై ఆయాశాఖల వారీగా సమగ్ర నివేదిక తయారుచేయాలని సూచించారు. శుక్రవారం రాత్రి నెల్లూరు పాలెం సమీపంలోని ఎస్టీ కాలనీని తాను సందర్శించానని. అక్కడ గిరిజనులు ఇళ్ల స్థలాలు లేవని, వర్షం వస్తే ఇల్లు ఊరుస్తున్నాయని తమకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని, అలాగే అక్కడే యువతతో కూడా తాను మాట్లాడానని, వారిలో చాలామంది ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లుగా, కూలీలుగా పనిచేస్తున్నారని. ఈ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు. సోమశిల జలాశయ మరమ్మతు పనులు, హైలెవల్ కెనాల్, తెలుగుగంగ పనులు, విక్రమసింహపురి యూనివర్శిటీ ద్వారా ఆత్మకూరులో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు, సంగం బ్యారేజీ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం చేయడం తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా నివేదికలు రూపొందించాలని కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, డయాస్, బందోబస్తు, పార్కింగ్, రూట్‌మ్యాప్‌పై ఎస్పీతో మంత్రి ప్రత్యేకంగా చర్చించారు.నెల్లూరులో నూతన కలెక్టరేట్ భవనం ఏర్పాటు, అధునాతన అతిథిగృహం, ఆత్మకూరు బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, ఆదూరుపల్లి రెసిడెన్షియల్ పాఠశాలల ఇంటర్‌మీడియట్ వరకు అప్‌గ్రేడ్, సంగంలో ఐటిఐ ఈ ఏడాది నుంచే ప్రారంభం తదితర అంశాలు కూడా కలెక్టర్ మంత్రి మధ్య చర్చకు వచ్చాయి. గతంలో నెల్లూరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండాలని ప్రణాళిక రూపొందించామని, అయితే జిల్లా పరిషత్, ఎస్పీ కార్యాలయం, కార్పొరేషన్ కార్యాలయం తదితర భవనాలు నిర్మించగలిగామని, కలెక్టరేట్ మాత్రం మిగిలిపోయిందని, ఈ ప్రభుత్వంలో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. దీనికి సంబంధించిన ఒక నోట్‌ను కూడా అందించాలని కలెక్టర్‌ను మంత్రి ఆనం కోరారు.