పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న (29 అక్టోబర్ 2025)
మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి బుధవారం ఉదయం క్షేత్ర స్థాయిలో విస్తృత తనిఖీ చేపట్టారు. అధికార యంత్రాంగంతో కలిసి, నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలైన కుందునది పరివాహక ప్రాంతం (నందమూరి నగర్ పోయే రోడ్డు), వైయస్సార్ నగర్ ఏరియా, పెద్దకోటల, శ్యాంనగర్ చామకాలువ, శ్రమదానం బ్రిడ్జి, మరియు ఎస్బిఐ కాలనీ (రామకృష్ణ పిజి కాలేజ్ సమీపంలో) లలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. నీటి ప్రవాహం, కాలువల సామర్థ్యం, మరియు నివారణ చర్యలపై వారు సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, టిడిపి నాయకులు తమ ప్రాంతాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మంత్రివర్యుల ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ “ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం అని. కాలువలకు నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించడం జరిగింది. అనవసరంగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ “అన్ని సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని . సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచామని , అత్యవసర పరిస్థితుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల టిడిపి మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి మరియు ఆర్డిఓ, ఎమ్మార్వోలు, ప్రభుత్వ అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు



